కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మట్టిమాఫియా బరితెగించింది. రాత్రికి రాత్రే గుట్టలను మాయం చేస్తున్నది. అధికారుల అండదండలతో రాత్రీ.. పగలూ అనే తేడా లేకుండా జేసీబీలతో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నది. కళ్ల ముందే జోరుగా దందా సాగిస్తున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
మట్టి మాఫియా దాదాగిరి..
రెబ్బెన మండలం గోలేటి సమీపంలో వెంచర్లను డెవలప్ చేసేందుకు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిన్నింగ్ మిల్లులు, భవనాలు, రోడ్ల నిర్మాణం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు అక్రమంగా మట్టితవ్వకాలు చేపడుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి దగ్గరలోని చిర్రకుంటకు వెళ్లే దారిలో ఉన్న పోచమ్మ ఆలయం సమీపంలోని గుట్టల వద్ద ఏకంగా జేసీబీలను పెట్టి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. రోజుల తరబడి మట్టిని తోడుకెళ్లడం వల్ల గుట్టలు కనుమరుగై మైదానాలుగా మారుతున్నాయి. ఈ విషయమై ప్రశ్నిస్తున్న స్థానికులపై మట్టి మాఫియా దాదాగిరి చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే ఈ వ్యవహారం సాగుతుండగా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే సహజవనరులకు తీరని నష్టం కలగనున్నది.