మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 26 : జిల్లా కేంద్రంలోని రాళ్లవాగును కొందరు చెరబడుతున్నారు. నిన్న మొన్నటి దాకా ఇసుకను ఎత్తుకెళ్లిన దొంగలు.. నేడు వాగులో తేలిన బండలను సైతం వదలడం లేదు. రాళ్లను పగులగొట్టి తరలించుకుపోతూ అందినకాడికి దండుకుంటున్నారు. మంచిర్యాల నుంచి మందమర్రి మండలం బొక్కలగుట్ట, కుర్మపల్లి గ్రామాల వరకు విస్తరించి ఉన్న ఈ వాగు వెంట ప్రతిరోజూ వందలాది వాహనాల్లో బండరాయితో పాటు ఇసుక కూడా తరలిపోతున్నది. జిల్లా కేంద్రానికి మూడు, నాలుగు కిలో మీటర్ల దూరంలోనున్న ఈ వాగులో యథేచ్ఛగా దందా సాగుతుండగా, అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అక్రమార్కులు పగలు వాగులో ఉన్న రాళ్లను ముక్కలుగా పగులగొడుతున్నారు. రాత్రి కాగానే ట్రాక్టర్ల ద్వారా తరలించడం చేస్తున్నారు. మరికొందరైతే వాగుకు సమీపాన కుప్పలు పోస్తున్నారు. వాగు వెంట ఎక్కడ చూసినా బండరాళ్ల కుప్పలే దర్శనమిస్తున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి ముందుగానే ఆర్డర్ తీసుకొని బండను చేరవేస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపెడుతున్నారు.
ప్రతి రోజూ వందల సంఖ్యలో వాహనాల్లో బండరాయి తరలిపోతుండగా, సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా అంతా ఆయా శాఖల అధికారులకు తెలిసే జరుగుతుందని తెలుస్తున్నది.
మంచిర్యాల సమీపంలోని రాళ్లవాగు నుంచి గ్రానైట్ తరలిపోతున్న విషయం మా దృష్టికి రాలేదు. ఇకపై అక్రమ గ్రానైట్ తరలింపు పా యింట్లను గుర్తిస్తాం. తరలిస్తున్న వారిపై చట్ట రీ త్యా చర్యలు తీసుకుంటాం. ఇసుక, గ్రానైట్ అక్ర మ దందా చేస్తున్న వాహనాలపై దృష్టి సారిస్తాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. ప్రజలు సైతం సహకరించాలి. అక్రమంగా జరిగే ఏ విషయాన్ని అయినా మాకు తెలియజేయాలి.
– బాలు నాయక్, మైనింగ్ ఏడీ, మంచిర్యాల