నిర్మల్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ) : ఈ వానకాలంలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులకు జూలైలోనే వరదలు ప్రారంభం కావడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు ఆయా ప్రాజెక్టుల క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. అలాగే ప్రాజెక్టుల పరిధిలోని కాలువల ద్వారా చెరువులను నింపడంతో గత జూలై నుంచే చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు భారీ వర్షాలు కురియడంతో చెరువులన్నీ అలుగు పారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన వాగులపై గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాంలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎటు చూసినా నీటి నిల్వ లు కనిపిస్తుండడంతో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగాయి. ఎక్కడ చూసినా పాతాళగంగ పైకి ఉబికి వస్తున్నది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి జిల్లాలో సగటు భూగర్భ జలాలు 2.45 మీటర్లకు చేరాయి. తాజాగా భూగర్భజల శాఖ నివేదికలో గత మే నెలతో పోలిస్తే సెప్టెంబర్ నాటికి జిల్లాలోని 98 శాతం బోర్లలో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయి. దీంతో బోరుబావుల నుంచి సమృద్ధిగా నీరు వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా గత ఎండాకాలంతో పోలిస్తే సగటు 8.5 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి.
గత మే నెలలో జిల్లా సగటు భూగర్భ జల నీటిమట్టం 10.95 మీటర్లు ఉండగా, జూన్‌లో 9.35 మీటర్లు, జూలైలో 8.23 మీటర్లు, ఆగస్టులో 4.11 మీటర్లు, సెప్టెంబర్‌లో ఏకంగా 2.45 మీటర్ల లోతుకు నీటి మట్టాలు చేరుకున్నాయి. అలాగే గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే జిల్లా వ్యాప్తంగా సగటు 1.35 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు 3.80 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 2.45 మీటర్ల లోతులోనే నీటి నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. గత ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్ చివరి నాటికి ఒక్క నెలలోనే 1.66 మీటర్ల భూగర్భ జలాల పెరుగుదల కనిపించింది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 70 వేల వరకు బోరు బావులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భూగర్భ జలాలు భారీగా పెరిగినందున వచ్చే యాసంగిలో బోరుబావుల కింద సాగుకు డోకా లేనట్లేనని రైతులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. 2023లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాగా, 2024 లో మంచి వర్షాలే కురిశాయి. అయితే గతేడాది కంటే ఈ ఏడాది అధిక వర్షపాతంతో భూగర్భ జలాలు మరింత పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ఈసారి అన్ని జిల్లాల్లోనూ సాధారణం కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదు కాగా, నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 27.11 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 910.1 మిల్లీ మీటర్లు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1,156.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ నీటిని పొదుపుగా వాడుకోవాలని, భావితరాలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులు సూచిస్తున్నారు.