మంచిర్యాల, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అల్పాపీడన ప్రభావంతో రెండు రోజులుగా కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల దాకా ఎడతెరపి లేకుండా పడింది. మంచిర్యాల వద్ద రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. మంచిర్యాలలోని బైపాస్‌రోడ్డు నుంచి రంగంపేటకు మధ్య రాళ్లవాగుపై ఉన్న కాజ్వే వంతెన పై నుంచి వరద ప్రవహించింది. బైపాస్‌రోడ్డు నుంచి రంగంపేట, పవర్కాలనీ, పాతమంచిర్యాల, అండాళమ్మకాలనీల వైపునకు రాకపోకలు నిలిచిపోయాయి.
బెల్లంపల్లిలోని రాంనగర్ బ్రిడ్జి ఉధృతంగా ప్రవహించి హన్మాన్బస్తీ, రాంనగర్ బస్తీలకు రాకపోకలు నిలిచాయి. కలెక్టర్ కుమార్‌దీపక్ రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించారు. తొమ్మిదో వార్డు రైల్వేరడగంబాల బస్తీలోని జాతికుంట చెరువు పొంగి పొర్లడంతో సమీప ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు రైల్వే కాలనీ బ్రిడ్జి క్లియర్ లేకపోవడంతో నివాస గృహాల్లోకి వరద వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను మున్సిపల్ కమిషనర్ రమేశ్ పరిశీలించారు.
బూధకలాన్, చాకెపల్లి, చంద్రవెల్లి, ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి ప్రాంతాల్లోని చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు మెయిన్‌రోడ్డుపై వరద చేరిన గుంతల వద్ద సింగరేణి జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. భీమిని మండలం లక్ష్మీపూర్, కర్జీభీంపూర్, రాజారం, వెంకటాపూర్, చిన్న తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌కుమార్ పర్యటించారు.
చిన్న తిమ్మాపూర్ గ్రామంలో పర్యటించి ఎర్రవాగు, నల్లవాగు నీటి ఉధృతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 200 ఎకరాల్లో వరి, 1200 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కాసిపేట మండలంలోని కోమటిచేనుకు చెందిన రాంటెంకి బక్కయ్య ఇల్లు కూలింది. నెన్నెల మండలంలోని వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరి, పత్తి పంటలు నీట మునిగాయి. నెన్నెల, కోణంపేటలో పలు ఇండ్లలోకి వరద వచ్చి చేరింది. తాండూర్ మండలంలో బోయపల్లి ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి వరద వచ్చింది.
కిష్టంపేటలో మల్లే శంకరమ్మ, అచ్చులాపూర్‌లో గట్టు నానయ్య, పొట్లపల్లి రాజయ్య ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంగడి బజారు, పెట్రోల్ బంక్ రేచిని రైల్వే స్టేషన్, బోయపల్లి బోర్డు వద్ద గల మూడు అండర్ బ్రిడ్జిల వద్ద వరద చేరగా, 15 గ్రామాలకు పైగా రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేమనపల్లి మండలంలోని జక్కెపల్లి చెరువు మత్తడి పారింది. జిల్లెడకు చెందిన గుండెపెల్లి చీకటి ఇల్లు కూలిపోయింది. నీల్వాయి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో నిండుకుండలా మారి మత్తడి దూకింది.
కన్నెపల్లి నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంటలు మునిగాయి. ముత్తాపూర్లో చెరువు నీరు రోడ్డు మీదకు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాలిగాంలో పాల్వాయి పురుషోత్తం రావు ప్రా జెక్టు నీరు ఇండ్లలోకి చేరగా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నీల్వాయి ప్రాజెక్టును బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ పరిశీలించారు. శ్రీరాంపూర్, మందమర్రి, ఇం దారం, ఖైరిగూడ సింగరేణి ఓపెన్కాస్టుల్లోకి వరద చేరింది. దీంతో 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది.
ఆసిఫాబాద్‌లో జిల్లాలో..
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్/ఆసిఫాబాద్ టౌన్/దహెగాం/రెబ్బెన/సిర్పూర్(యు), ఆగస్టు 13 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనిరాజూర గ్రామ సమీపంలోని ఒర్రె ఉప్పొంగి ప్రవహించగా, ఉదయం 9 గంటల వరకు రాక పోకలు నిలిచిపోయాయి, జిల్లా కేంద్రంలోని జూబ్లీ మారెట్ జల దిగ్బంధం అయింది. తుంపల్లిలోని పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో కలెక్టర్ వెంకటేశ్‌ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తహసీల్దార్ రియాజ్ అలీ పరిశీలించారు.
అత్యవసర సమయాల్లో కంట్రోల్ రూం 8500844365ను సంప్రదించాలని సూచించారు. గుండి వాగు సైతం ఉప్పొంగడంతో ఆసిఫాబాద్ పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. దహెగాంలోని పెద్దవాగు, ఎర్రవాగు ఉప్పొంగడంతో సమీపంలోని పత్తి, వరి పంటలు నీటమునిగాయి. డోరుమల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో కోత్మీర్ గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడ, జెండాగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సిర్పూర్(యూ) మండలం దేవుడుపల్లి వాగు వద్ద కల్వర్టుపై నుంచి భారీగా వరద ప్రవహించడంతో తహసీల్దార్ ప్రహ్లాద్, ఎంపీడీ కృష్ణారావు రాకపోకలు నిలిపి వేశారు. పెసర్‌కుంట గ్రామాన్ని సబ్‌కలెక్టర్ శ్రద్ధ్దాశుక్లా సందర్శించారు. రెబ్బెన మండలం గంగాపూర్ వాగు, కొండపల్లి వాగు, పులికుంట వాగు, గుండాల వాగుకు వరద పోటెత్తింది. ఎన్టీఆర్ కాలనీ, గోలేటి రేకులగూడలో ఇండ్లలోకి వరద వచ్చి చేరడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ కాలనీని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పర్యటించారు.
నదులు, ప్రాజెక్టుల్లోకి వరద..
మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లోనూ జోరుగా వానలు పడుతుండగా, ప్రాణహిత, పెన్‌గంగ, గోదావరి నదుల్లోకి వరద పోటెత్తుతున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి 19,062 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతున్నది. కడెం ప్రాజెక్ట్ నుంచి 11,374 క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ఏరియా నుంచి కొంత నీరు వస్తున్నది. ప్రాజెక్ట్ మొత్తం సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, బుధవారం నాటికి 13.7124 టీఎంసీల నీరు వచ్చింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ (కుమ్రం భీం) ప్రాజెక్ట్‌కు భారీ వరద వచ్చి చేరుతోంది. 3,4,5,6,7 గేట్లను 2.0 మీటర్లు ఎత్తి 21254 క్యూసెకుల నీటిని దిగువకు వదిలారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఆగస్టు 13 : రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాల కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, యంత్రాంగం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తక్షణ సాయం కోసం నస్పూర్‌లోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08736-250501 నంబర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 13 : భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంచిర్యాల జోన్ పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే డయల్ 100కి ఫోన్ చేయాలని తెలిపారు.
గర్భిణిని వాగు దాటించిన పోలీసులు
తాండూర్, ఆగస్టు 13 : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణిని పోలీసులు వాగు దాటించి ప్రశంసలు అందుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని నర్సాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న రోడ్ డ్యాం కల్వర్టు పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో, ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దొడ్డిగూడెంకు చెంది న తొమ్మిది నెలల గర్భిణి కొడిపె యమునకు పురిటి నొప్పులు వచ్చాయి.
ఆమెను అక్కడి వాగును దాటించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్ఐ కిరణ్‌కుమార్, సిబ్బంది, గజ ఈతగాళ్లతో అక్కడికి చేరుకున్నారు. తాళ్ల సాయంతో గర్భిణిని వాగు దాటించారు. అంబులెన్సులో ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కాగా, యమున బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానలో మగ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాండూర్ ఎస్ఐని సీఐ దేవయ్య, అధికారులు, నాయకులు, ప్రజలు అభినందించారు. వాగుకు అడ్డంగా మట్టి పోయడం వల్ల దాదాపు 6 మీటర్ల ఎత్తున ఉన్న బ్రిడ్జి పూర్తిగా మట్టితో నిండిపోయిందని, దాంతో వరద బ్రిడ్జిపై నుంచి పోతోందని, అందుకే గర్భిణి అవస్థలు పడాల్సి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. ఏ ఒక ప్రాణం పోయినా.. బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఉన్నతాధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని గొండ్వానా పంచాయతీ, రాయ్ సెంటర్ నర్సాపూర్ సభ్యుడు మడావి అమృతరావు అన్నారు.