బోథ్, జూలై 21: ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురవగా జనజీవనం స్తంభించింది. జిల్లాలో సగటు వర్షపాతం 57.4 మిల్లీ మీటర్లు నమోదుకాగా, సిరికొండ మండలంలో 195.4 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 173.6, ఇంద్రవెల్లిలో 124.6, బోథ్‌లో 98.2, బజార్హత్నూర్లో 65.4, నేరడిగొండలో 62.2, ఉట్నూర్‌లో 59.8 , తలమడుగులో 52.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. బోథ్ మండలం మర్లపెల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో చుట్టూపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిగిని, బాబెరతండా, కంటెగాం అటవీ ప్రాంతాల్లో వాగు ఉప్పొంగి వరద ఇండ్లలోకి ప్రవేశించడంతో చెరువు తెగిపోయిందనే వదంతులు వ్యాపించడంతో గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా గడిపారు.
బాబెరతండా, కంటెగాం మధ్యలో పలుచోట్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వంతెన వద్ద కోతకు గురవడంతో వాహనాల రాకపోకలకు వీలు లేకుండా మారింది. పత్తి, సోయా, కంది తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోథ్ సమీపంలోని కండ్రివాగు వద్ద వేసిన తాత్కాలిక పైపు కల్వర్టు వంతెన పూర్తిగా దెబ్బతింది. మళ్లీ వర్షం కురిస్తే 25 గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి వర్షానికే బోథ్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో అలుగు పారుతున్నది. సొనాల, ధన్నూర్ (బీ), బోథ్, కౌఠ(బీ), పొచ్చెర ప్రాంతాల్లోని పొలాల్లో నీరు నిలవడంతో పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బజార్హత్నూర్, జూలై 21: కురుస్తున్న వర్షాలకు బజార్హత్నూర్లోని చెరువు నిండుకుండలా మారింది. చెరువు అలుగుపై నుంచి వరద ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం గ్రామంలోని యువత, గ్రామస్తులు, మత్స్యకారులు వలలతో చేపలు పడుతూ బిజీబిజీగా కనిపించారు. దీంతో చెరువు పరిసరా ప్రాంతం అంతా సందడి నెలకొంది.
ఇచ్చోడ, జూలై 21: మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో అధ్యాపకులు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. జామిడికి వెళ్లే రోడ్డులో తాత్కాలిక అప్రోచ్ వంతెన తెగిపోవంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోరిగామ, ముక్రా(కే), కోకస్మన్నూర్, అడిగామ గ్రామాల్లో వాగు పక్కన పొలాల్లోకి నీరు చేరింది.
దుబార్పేట్ గ్రామానికి చెందిన ఆదివాసులు హైవే రహదారితో తమ ఇంట్లోకి నీరు చేరుతుందని శుక్రవారం హైవేపై ఆందోళన చేపట్టారు. దీంతో సుమారు 4 గంటల వరకు జాతీయ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, ఆర్డీవో స్రవంతి, ఇచ్చోడ సీఐ చంద్రశేఖర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కొండపూర్ తాత్కాలిక అప్రోచ్ వంతెన తెగిపోవడంతో ఇంద్రవెల్లి, సిరికొండ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనను సిరికొండ తహసీల్దార్, వర్ణ, రెవెన్యూ సిబ్బంది కలిసి పరిశీలించారు. మండలంలోని ధర్మసాగర్, కన్నపూర్, లచ్చింపూర్, కుంటగూడ, నారాయణపూర్‌లోని వాగు పక్కన పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో పంటలు నీట మునిగిపోయాయి.
భీంపూర్, జూలై 21 : మండలంలోని గుబ్‌డి, గోముత్రి, అంతర్గాం, వడూర్, గొల్లగడ్ రేవుల వద్ద పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ మహారాష్ట్ర ప్రాజెక్టు నుంచి కూడా వరద వదలడంతో పెన్‌గంగ పరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్‌గంగ ఒడ్డున ఉన్న మోటర్లు, పైపులైన్‌ను రైతులు తొలగించి ఇళ్లకు తీసుకెళ్లారు. కొన్ని లోతట్టు పంట పొలాలు నీట మునిగాయి. పెన్‌గంగలో నాటుపడవలు కొట్టుకపోకుండా గంగపుత్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరంజి(టీ) పెద్దొర్రె, భీమన్న వాగు, టేకిడిరాంపూర్ వాగు పొంగి పొర్లుతున్నాయి రాజులవాడి , పిప్పల్‌కోటి తుమ్మలకుంట చెరువులు నిండుతున్నాయి. సరిహద్దు గుబ్‌డి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్ వాసులు వాగుల కారణంగా బయటి గ్రామాలకు రాలేని పరిస్థితి ఉన్నది. ఆదిలాబాద్ -కరంజి(టీ) రూట్లో బస్సులు వాహనల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని భీంపూర్ పోలీసులు సూచనలు చేస్తున్నారు.
బేల్సరిరాంపూర్లో నైతం విలాస్, సిడాం రాము, అంతర్గాంలో నిమ్మ సుజాత ఇండ్లు కూలిపోయాయి. సర్పంచ్‌లు పరిశీలించి అధికారులకు సమాచారం అందించారు.
తలమడుగు, జూలై 21: మండల కేంద్రంతో పాటు సుంకిడి, రుయ్యాడి, భరంపూర్, కజ్జర్ల, కుచులాపూర్, ఖోడద్, దేవాపూర్ గ్రామాల్లో ఉదయం నుంచి వర్షం కురవడంతో పొలాల్లో నీరు నిలిచింది. సుంకిడి భీమన్న వాగుపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నార్నూర్, జూలై 21 : గాదిగూడ మండలం ఖడ్కి, లోకారి(కే) గ్రామ సమీపంలో ప్రధాన రహదారి కల్వర్టులపై వరద ప్రవహించడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. నార్నూర్ మండలంలోని బారిక్రావ్గూడ, దన్నుగూడ, గాదిగూడలోని మారుతిగూడ గ్రామస్తులు రెండు రోజుల నుంచి బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్నారు. వాగులు పొంగిపొర్లుతుండడంతో గ్రామాలకే పరిమితమయ్యారు. గాదిగూడ మండలం లోకారి(కే) ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ కల్వర్టులను ఎంపీవో సాయిప్రసాద్, సర్పంచ్ మెస్రం దేవ్‌రావ్ పరిశీలించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సహాయక చర్యలు చేపట్టారు. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి విజయ్ ఉన్నారు.
తాంసి, జూలై 21: ఎగువన కురిసిన వర్షాలతో వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 14516 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో నీటి మట్టం 276.1 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం 276.1 మీటర్లు ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ హరీశ్‌కుమార్ తెలిపారు.
ఉట్నూర్, జూలై 21 : మండలంలోని మత్తడి, నాగాపూర్, గంగాపూర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరడంతో నిండుకుండలా మారాయి. దీంతో ఎక్కడ చూసిన జలకళ సంతరించుకున్నాయి. ఈ ప్రాంతంలోని నీరు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు చేరుతున్నాయి.
ఉట్నూర్ రూరల్, జూలై 21: మండలంలోని పులిమడుగు, శ్యాంపూర్, హస్నాపూర్, ఏందా, నర్సాపూర్, సాలేవాడతో పలు గ్రామాల్లోని పంట చేనులో వర్షపు నీరు నిలిచి పోయింది. అదేవిధంగా దంతన్‌పల్లి, పెర్కాగూడ, శ్యాంపూర్, పులిమడుగు, నాగాపూర్ గ్రామాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఇంద్రవెల్లి, జూలై 21: మండలంలోని వాల్గొండ, హీరాపూర్, వడగాం, జైత్రంతండా, అంజి, గిన్నేరా, సట్వాజీగూడ, మర్కాగూడ, బుర్సన్‌పటార్, గౌరాపూర్, దస్నాపూర్, ముత్నూర్, శంకర్‌గూడ, కేస్లాపూర్, పిట్టబొంగురం, హర్కాపూర్, మామిడిగూడ, జెండాగూడ, పిప్రి, చిత్తబట గ్రామాల వాగులు వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులతో పాటు నీటికుంటలు, చెక్‌డ్యాంల్లో భారీగా వరద చేరడంతో మత్తడిలపై నుంచి ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. జైత్రంతండా చెక్‌డ్యాం మత్తడిపై నుంచి వరద పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి.