మంచిర్యాల, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తూర్పు జిల్లాలైన మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లలో వర్షం దంచి కొ ట్టింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేకుండా వాన పడింది. భారీ వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులతో పాటు వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరులో 44.5 మిల్లీమీటర్లు, కోటపల్లిలో 41.5, వేమనపల్లి మండలం నీల్వాయిలో 27.0, చెన్నూర్‌లో 24.5, భీమారంలో 22.3, కన్నెపల్లిలో 22.5, భీమినిలో 20.5, చెన్నూర్ మండలం కొమ్మెరలో 20, నెన్నెలలో 19.3, కాసిపేట మండలం కొండాపూర్‌లో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో 33.0 మిల్లీమీటర్లు, పెంచికల్‌పేట మండలం ఎల్కపల్లిలో 26.3, దహెగాం మండలం కొంచవెల్లిలో 20.8, దహెగాంలో 20.0, రెబ్బెన మండలం వంకులంలో 20.5, చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌లో 17, కౌటాలలో 16.8 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
బెజ్జూర్ నుంచి సోమిని మార్గంలోని వాంగులు ఉప్పొంగడంతో సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్ మండలం రౌట సంకెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాతరౌట గ్రామానికి సమీపంలోని ఉట్ల వాగుపై ఏర్పాటు చేసిన తాతాలిక వంతెన తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి కోటపల్లి మండలంలోని ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలను పర్యటించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణ-మహారాష్ట్రలకు నాటు పడవల ద్వారా రాకపోకలను నిలిపివేయడంతో పాటు నదుల్లోకి చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. జిల్లాలో రోడ్డు సౌకర్యం లేని గ్రామాలతో పాటు ముంపు గ్రామాల్లోని గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. వేమనపల్లి మండలంలోని నీల్వాయి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. చెన్నూర్ పట్టణంలోని పెద్ద చెరువు, కుమ్మరి కుంట మినీ ట్యాంకు బండ్లు పూర్తిగా నిండాయి.
నెన్నెల మండల కేంద్రంలోని వడ్లవాడకు చెందిన దురిసెట్టి మల్లయ్య ఇల్లు కూలింది. ఆ సమయంలో వృద్ధ దంపతులు ఇంటి ముందున్న గుడిసెలో ఉండడంతో ప్రమాదం తప్పింది. తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో దామోదర్‌రెడ్డి, ఏంపీవో శ్రీనివాస్ ఇంటిని పరిశీలించారు. లంబాడీతండా ఎర్రవాగు ప్రవాహాన్ని అధికారులు సోమవారం పరిశీలించారు. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాజ్‌వేపై నుంచి వరద ఉప్పొంగి ప్రవహించడంతో ప్రయాణికులు ఎక్కడివారు అక్కడే ఉండి పోయారు. తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో దామోదర్‌రెడ్డి, ఎస్ఐ ప్రసాద్, నాయకులు శ్రీనివాస్ వాగును పరిశీలించారు. ఆయాచోట్ల అత్యధిక వర్షం పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
శ్రీరాంపూర్ ఓసీపీపై ప్రభావం
శ్రీరాంపూర్, సెప్టెంబర్ 9 : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరాంపూర్ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జూలైలో 10 రోజులు, ఆగస్టులో 15 రోజులు, ఈ నెలలో 5 రోజుల వర్షాలతో ఉత్పత్తికి విఘాతం కలిగింది. రోజుకు 10 వేల టన్నులతో 3 లక్షల టన్నుల బొగ్గు నష్టపోవాల్సి వచ్చింది. ఇందారం ఓసీపీలో రోజుకు 3600 టన్నులు బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగుతుంది. సింగరేణి ఓసీపీ(ఉపరితల) గనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు పడుతుండగా, 20 ఓసీపీల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతున్నది.
ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన మట్టి తవ్వకాలు, రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో వార్షిక ఉత్పత్తి లక్ష్యాలు వెనకబడిపోయాయి. సింగరేణి ఉపరితలంలో నిల్వ ఉన్న బొగ్గును విద్యుత్ పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. ఓసీపీ క్వారీలో వర్షపు నీటితో చెరువలను తలపిస్తున్నాయి. యాజమాన్యం ఎప్పటికప్పుడు మోటార్ పంపుల ద్వారా ఉపరితలానికి నీటిని తరలిస్తున్నారు. వర్షాలతో ఓసీపీల్లో పని చేస్తున్న కార్మికులు యంత్రాల మెయింటనెన్స్, ఉపరితలంలోని బంకర్లను రిపేరు చేస్తున్నారు.