Adilabad Heavy rain | నార్నూర్, ఆగస్టు 16: ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, గాదిగూడ మండలాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, పొలాల్లోకి నీరు చేరి జలమయమయ్యాయి. ఈ వర్షం కారణంగా ప్రజల సాధారణ జీవితం స్తంభించింది. గాదిగూడ మండలంలోని ఖడ్కి, లోకారికే, అర్జుని, దాబా, మేడిగూడ, చిత్తగూడతో పాటు నార్నూర్లోని బాబేఝరి ప్రధాన రహదారులపై ఉన్న కల్వర్టుల మీదుగా వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది.
భారీ వర్షాల కారణంగా వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. నార్నూర్లోని ముల్లంగి పంచాయతీ పరిధిలోని భారిక్రావుగూడ సమీపంలోని వాగు, బాబేఝరి పంచాయతీ పరిధిలోని ధాన్యం గూడ, అలాగే గాదిగూడ మండలంలోని అర్జుని పంచాయతీ పరిధిలోని మారుగూడ, కునికసా గ్రామాలకు సమీపంలో ఉన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమకు సహాయం అందడం కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని నార్నూర్ సీఐ పేందూర్ ప్రభాకర్ సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే నేరుగా సంబంధిత శాఖ అధికారులకు లేదా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని ఆయన కోరారు. లోకారికే కల్వర్టు వద్ద వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో గాదిగూడ పోలీసులు అక్కడ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అలాగే, వర్షాల కారణంగా చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. చేపల కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేయవద్దని కూడా సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
Adilabad Heavy Rain