దశాబ్దం పైచిలుకు కాలం గడిచిపోయింది. వైఫల్యాలు కుప్పలుతెప్పలుగా పోగుపడ్డాయి. అయినా మన వశీకరణ నేత అవేవీ అసలు పట్టించుకోడు. అన్నిటికీ జైకొట్టే భక్తగణం ఉండటమే అందుకు కారణం. వారిని ఇంకా ఇంకా కలల్లోనే ముంచుతుంటారాయన. ఉజ్వల భవిష్యత్తు చూపిస్తానని నమ్మిస్తూనే ఉంటారు. ఈ విషయంలో ఆయన ప్రదర్శిస్తున్న ‘అమోఘమైన ప్రతిభాపాటవాలను, అసాధారణ ఆకర్షణ శక్తిని’ బహుధా ప్రశంసించకుండా ఉండటం కష్టమంటున్నారు వ్యాసకర్త.
భారతదేశాన్ని బహుళ సంస్కృతుల, లౌకికవాద సమాజంగా చూడటం వైపే మొగ్గుచూపే నాకు ఈ ప్రభుత్వంతో నావైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యలు ఈ రచయిత ఏండ్ల తరబడి రాస్తున్న వ్యాసాల సంఖ్యతో సమానంగా ఉంటాయేమో. భావజాలం, సూత్రాలపరంగా ఉండే విభేదాలే అందుకు కారణం. చాలామంది ఇతరుల్లాగే హిందూత్వ అనేది సమస్యాత్మకమైనదని, ఈ దేశంపై అసహజంగా రుద్దబడుతున్నదని నేను భావిస్తాను. ఇక ప్రభుత్వం చేసిన పనుల గురించి నచ్చనివి, విభేదించేవి చెప్పాలంటే జాబితా చాంతాడంత ఉంటుంది. ప్రస్తుత ఏలుబడికి సంబంధించి నాకు ‘నచ్చినవి’ కనీసం ఓ రెండు అంశాలు ఎంచుకోమంటే, మొదటగా ప్రస్తుత ప్రధాని ఇదివరకటి బీజేపీ ప్రధానిలా కాకుండా మైనారిటీల మీద వ్యతిరేకతను గొంతెత్తి చాటుకోవడం వైపు వేలు చూపిస్తాను. ఇక నాకు ‘నచ్చిన’ రెండో అంశం ఏదని అడిగితే.. తన చర్యల ద్వారా ఆయన సంతృప్త అభిమాన గణాన్ని సృష్టించుకోవడాన్ని చూపిస్తాను.
ఇవి చాలా చిన్న రాయితీల్లాగా కనిపించవచ్చు. బహుశా ఇంకేదైనా చెప్పి ఉండాల్సిందేమో. కానీ, అదంత సులభం కానేకాదు. ప్రస్తుతం పన్నెండో ఏడులో కొనసాగుతున్న ఓ బృహత్ కథాక్రమాన్ని విశ్లేషిస్తున్నప్పుడు దాని ప్రభావాన్ని సమగ్రంగా చూడకుండా తప్పించుకోవడం సాధ్యపడదు. ఒక సినిమా మీరు ఏ మాత్రం చూడలేని విధంగా ఉంటే.. ‘ఈ సినిమా చూడటం నా వల్ల కాదు గానీ, హీరో మార్చిన డ్రెస్సులు మాత్రం బాగున్నాయి’ అని చెప్పడంలో అర్థం లేదు. మనం చర్చిస్తున్న సినిమాకు ఈ సమీక్షకుడి నుంచి కేవలం ఒకటిన్నర స్టార్లు మాత్రమే పడతాయి. అవీ అయిష్టంగానే. కానీ, ఇక్కడ ఈ సినిమా అద్భుతంగా ఉందనే అభిప్రాయం కలిగిన వ్యక్తులతో కూడిన మరో పార్శ్వం కూడా స్పష్టంగానే ఉంది. ఈ వ్యాసం అలాంటి వారి గురించి రాసిందే.
మోదీ విధానాలకు జైకొట్టేవారు జనాభాలో పరిగణనకు రానంత చిన్న భాగమేమీ కాదు. ఈ కారణంగా దీనిని పరిశీలించడం ఆసక్తికరంగానే ఉంటుంది. వివక్షాపూరిత చట్టాలతో, దూరంగా పెట్టే విధానాలతో, విషపూరిత వాగాడంబరంతో మైనారిటీల మీదే ఆయన దృష్టి కేంద్రీకరించినంత కాలం, ఇతరత్రా ఆయన ఏం చేసినా ఈ అభిమాన వర్గానికి అసమ్మతి కలుగనే కలుగదు. ఈ ధోరణికి ఎల్లెడలా సాక్ష్యాలు పరచుకుని ఉన్నాయి కనుక, దీని గురించి మరింత లోతుగా విప్పిచెప్పడమే ప్రస్తుత వ్యాస రచన వెనుక గల ముఖ్యోద్దేశం.
గత కొద్దివారాల్లో జరిగిన ఘటనలు మన పరిశీలనకు బోలెడు సరంజామాను సమకూరుస్తున్నాయి. వస్తు, సేవల పన్నునే తీసుకోండి. సుమారు దశాబ్దం క్రితం ఆ చట్టాన్ని ఆమోదించినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులోకి నడిపించే ముందుచూపుతో కూడిన సంస్కరణ అవుతుందని నమ్మబలికారు. సర్కారీ నిపుణులు టెలివిజన్ చానళ్లలో బారులుతీరి జీడీపీని ఆ పన్ను రెండు శాతం అమాంతంగా పెంచేస్తుందని, అదెలా సాధ్యమో వారు చెప్పకుండానే ఊదరగొట్టారు. అంతిమంగా అలాంటిదేదీ జరగనే లేదు.
అది వ్యాపారులకు సంక్లిష్టంగా ఉందని, పరోక్ష పన్నుల తలాతోకా లేని బాదుడు పేదలపై మరీ ఎక్కువ భారం మోపుతుందని, ఆదాయాలపై రాష్ర్టాల నియంత్రణ తొలగించడం ద్వారా వాటికి తీవ్ర అన్యాయం చేస్తుందని విపక్షాలు మొత్తుకున్నాయి. ఈ వాదనలన్నీ నిజమైనవే. ఈ వారం పన్నురేట్లను సవరించిన తర్వాత మరోసారి అదే చెప్పారు. మొదటి జీఎస్టీలో తప్పులున్నాయని, సవరించిన కొత్త జీఎస్టీ గొప్ప భవిష్యత్తులోకి నడిపిస్తుందని మురిపిస్తున్నారు. ఈ తప్పిదాన్ని తెలుసుకునేందుకు పదేండ్ల కాలం ఎందుకు పట్టింది? అనేది అసలు ప్రశ్న. భజనపరులైన మద్దతుదారులు కానివారి నుంచే ఈ ప్రశ్న వస్తుంది. భక్తజనులకు మాత్రం 2017 జీఎస్టీ గొప్పది గానూ, ఇప్పటి 2025 జీఎస్టీ అద్భుతమైనది గానూ కనిపిస్తుంది.
‘భారత్‌పై తోకముడిచిన ట్రంప్..’ ఇండియా దుష్ట చైనా పాలైందని రుసరుసలాడిన మరుసటి రోజే పీఎం మోదీ గొప్ప మిత్రుడని ప్రశంస వంటి శీర్షికలతో వార్తాపత్రికలు దద్దరిల్లజేశాయి. ట్రంప్ ఏమైనా 50 శాతం టారిఫ్‌లను ఎత్తివేశారా? లేదు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఇండియాను శిక్షించాలనే విధానాన్ని, కనీసం ఆ భాషనైనా అమెరికా మార్చుకున్నదా? అంటే అదీ లేదు. పై శీర్షికలు వచ్చిన రోజే ఆ పత్రికలే ‘భారత్ క్షమాపణ చెప్తుంది, రెండు నెలల్లోనే ఒప్పందానికి వస్తుంది: లూట్నిక్’ అనే శీర్షికతో అమెరికా కామర్స్ సెక్రెటరీ ప్రకటనను ప్రచురించాయి. మరైతే ట్రంప్ తోక ముడిచిందెక్కడ? నమ్మేవారి బుర్రల్లోనే ఆ యూటర్న్ చోటుచేసుకుంది. ‘అమెరికా- ఇండియా టారిఫ్ వివాదం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభకు మోదీ దూరం’ అనే మూడో శీర్షిక తాజాగా దర్శనమిచ్చింది. అంటే సమస్య కొనసాగుతూనే ఉందన్న మాట. మనం గెలిచామని నమ్మేశాం ఇంకా వాస్తవాలతో పనేముంది?
చైనాను శత్రువుగా చూడాలని 2020 ప్రారంభం నాటి నుంచి ఐదేండ్ల పాటు ఈ దేశానికి చెప్తూ వచ్చారు. చైనీస్ యాప్స్ తీసేయాలని, టెలివిజన్లను అవతల పారేయాలని భక్తులకు ఎక్కించారు. చైనాను ‘కట్టడి’ చేయడానికి మనం అమెరికాతో ఎలా జట్టు కట్టాలో సిద్ధాంతాలు నూరిపోశారు. పశ్చమానికి దగ్గరగా చేర్చే ఈ మహత్తరమైన ఖండాల కలయిక గురించి ప్రభుత్వంతో మిలాఖతైన థింకుట్యాంకుల్లోని ‘జియో-స్ట్రాటజిక్’వాలాలు టన్నుల కొద్దీ విశ్లేషణలు వండివార్చారు. ఇప్పుడు, కొద్దిరోజుల క్రితం వరకైతే, ఈ సెంటిమెంటు ఆగిపోవడమే కాదు, వెనుదిరిగింది కూడా. ఇప్పుడు చైనా మన మిత్రదేశం. చైనా తోడుగా ఉంటే అమెరికా ఆధిపత్యాన్ని మనం ఉఫ్ అని ఊదిపారేయగలం. అయితే చైనీయులు మనల్ని 2020 నాటికంటే, లేదా అంతకు ముందరి కంటే భిన్నంగా ఏమైనా చూస్తున్నారా? అదేమీ లేదు. ఈ ప్రభుత్వం తన మద్దతుదారుల అభిప్రాయాలను మార్చివేసినంత సులభంగా చైనా మారదు. మనం మన పరిస్థితులకు అనుగుణంగా మన దృక్పథాలను సరిదిద్దుకుంటున్నాం. ‘కాసేపు తూర్పు, కాసేపు పడమర’ అనే డోలాయమాన విధానం ఇది. భలే సమయస్ఫూర్తి.
నేను ఇదివరకే చెప్పినట్టుగా గత పన్నెండేండ్ల కాలంలో జరిగిన విషయాల్లో మెచ్చుకోవాల్సినవి పెద్దగా లేవు. వాస్తవిక నష్టం జరిగింది. దశాబ్దాలుగా అది కొనసాగుతుంది. కానీ, చుట్టూరా కుప్పలుతెప్పలుగా పోగైన వర్తమాన శిథిలాల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా, తన అనుయాయులను ఇంకా ఉజ్వల భవిష్యత్తు చూపిస్తానంటూ నమ్మించడంలో వశీకరణ నేత ప్రదర్శిస్తున్న ప్రతిభాపాటవాలను, ఆకర్షణ శక్తిని బహుధా ప్రశంసించకుండా ఉండటం చాలా చాలా కష్టం.
(‘నేషనల్ హెరాల్డ్’ సౌజన్యంతో…)
– ఆకార్ పటేల్