‘రెక్కల్ ఆతేఖమ్ పిట్టిపిట్ట మాళేమాతి ఓడ్ జావ. ఓడ్ జావ్ను సదా. హనురతోజ్ ఓ బంచ. నతో వుందున, వుందుర్ ఛిచావరేన పాళ్నుకతో ఆప్ణేర్ కత వంగ్ద. మనక్యాన ఏక్ కామ్ కరతోజ్ కాయి ఆపణ్ లంబాడీ వాళేర్ దాడో నికళ’ (రెక్కలొచ్చిన పచ్చులు గూట్లోంచి ఎగిరిపోతనే ఉంటయి, పోవాలె గూడ. అట్లయితేనే వాటికి బతుకుదెరువు. లేకుంటే వాటిని, వాటి పిల్లల్ని సాకాలంటే తల్లి పచ్చులమైన మనతోనేడైతది? నపరో సార్గం, తలో పని జేస్కుంటెనే గదా మన లంబాడీ బతుకులకు తెల్లారేది?)
మాకు ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డ. ఆమెను ఓ అయ్యకిచ్చి లగ్గం జేసి, అత్తగారింటికి సాగదోలినం. కొడుకులకూ పెండ్లిళ్లు జేసినం. మాకున్న భూమి ఎకరం అరబిగడే. ఆ ఎకరంన్నరల ఎంతమందిమి బతుకుతమనే ఇశారం జేసి కొడుకులిద్దరు పట్నం వలసవోయిన్రు. ఇగ నా పెనిమిటి ‘మాలోతు హస్సేన్’కి పన్జేసి పన్జేసి యాష్టకొచ్చినప్పుడల్లా కొడుకులను యాజ్జేసుకుంటా ఉంటడు. ఆయన వాళ్లను యాజ్జేసుకున్నప్పుడల్లా నేనిట్లా.. ‘రెక్కల్ ఆతేఖమ్ పిట్టిపిట్ట’ అని సర్దిచెప్తుంటా. ఒక్కనాడా.. రెండ్రోజులా.. ఇయ్యాల్టికి మూడొద్దులాయె. ఎగిలివారంగ వోతున్నడు, పొద్దుగూకినంక అస్తున్నడు. అయినా ఆ పని పాడుగాను దంగుతలేదు. అందుకే ఆ పని మీద పోవుడంటనే ఆయనకిసుగొస్తున్నది. ఎటూ దొయ్యక కొడుకుల మీన పొద్దు వోతున్నడు. నా పెనిమిటి బాధను అర్థం జేస్కున్న గావట్టే.. ‘సోవార్ తు జోమత్.. మ జావుంచు’ (రేపు నువ్ పోవుడద్దు.. నేనే వోత) అన్జెప్పిన.
ఆ రోజు బుధారం. పొద్దుగాళ్ల ఆరు గొడ్తున్నది. ఇంత సద్దన్నం, దానంచుకు మాడికాయ తొక్కుతోని సద్ది గట్టుకున్న. నా తొవ్వ దేవ్లాతండాలోని మా ఇంటికాన్నుంచి పాలకవీడు మండల కేంద్రం (సూర్యాపేట జిల్లా)లోని సుసైటీ దగ్గరికి సాగుతున్నది. దగ్గెర దగ్గెర పది, పన్నెండు కిలోమీటర్లుంటది ఆ తొవ్వ. మా తండాకు గవర్నమెంటోని బస్సు గూడ దిక్కు లేదు. గంటాయె ఆటో కోసం నిలవడి. అట్ల నిలవడితే గానీ ఆటో రాదు. గంటన్నర తర్వాత ఓ ఆటో ఆగింది గనీ, నిండా జనాలున్నరు. ఆ ఆటో ఎక్కకుంటె ఏడగానిదాన్నైతనని ఒక్కశిత్తం జేస్కున్న.
పదిన్నర గొడ్తున్నది, పాలకవీడు రానే అచ్చింది. సుసైటీ దగ్గర్నే ఆగింది ఆటో. ఆటో దిగి జూస్తే అక్కడ మనుషులే లేరంటే ఇగ లైనెక్కడిది? ‘అమ్మయ్యా..’ అని మన్సులనుకొని సక్కగ ఆఫీసు దగ్గర్కి వోయిన. ‘ఓ పెద్దమ్మా.. నీకు శెప్పుల లైన్ కనవడ్తలేదా?’ అని శెట్లకింది నుంచి కీకలేస్తనే ఉన్నరు జనాలు. వైసు మీద వడ్డది గదా? కన్లు జర నజరిస్తలెవ్వు. వాళ్ల కీకలిని పరీక్షవట్టి కిందికి జూస్తే శెప్పుల లైన్ మస్క మస్క గొడ్తున్నది. ఆ శెప్పులను జూసినంక.. ‘మస్తు మంది జనాలుంటరు, ఏ నాత్రైతదో పో నువ్ మళ్లా ఇంటికొచ్చేసరికి’ అని పొద్దున నా పెనిమిటి అన్న మాటలు అప్పుడినవడ్డయి.
ఎంబటే ఎన్కకొచ్చిన. దాదాపు అద్దకిలోమీటరున్నదా శెప్పుల లైన్. జనాల కు నిలవడే ఓసర లేక శెప్పులు లైన్ల వెట్టి శెట్లకిందికి వోయిర్రని నాకు తర్వాత అర్థమైంది. నేన్గూడ శెట్ల కిందికి ఇట్ల శేరుకున్ననో లేదో.. ‘ఓ పెద్దమ్మా ఆధార్ కారట సూపెట్టి పేరెక్కిచ్చుకోపో.. లేకుంటే మళ్లా ఉత్తగనే మర్ల గొడుతరు’ అని శెప్పవట్టిర్రు శెట్ల కింది జనాలు. వాళ్ల మాటలిన్న నేను సుసైటీ ఆఫీసు లోపల్కి వొయి ‘మాలోతు లక్ష్మీ, దేవ్లాతండా’ అని హాజరేపిచ్చుకున్న.
పగటీలి ఒకటైతున్నది, రెండైతున్నది. నా సుట్టూరా ఉప్పుకారం వాసన రువ్వడిగా గొడ్తున్నది. ఏంటిదా అని జూస్తే ఒక్కొక్కలు తెచ్చుకున్న సద్దులు ఇప్పుతూ కనవడ్డరు. ఇగ లాభం లేదు, తెచ్చుకున్న సద్దిని తెరుద్దామని నేన్గూడ వోయి శెయ్ గడుక్కున్న. అవే శెట్ల కింద బండలుంటే ఓ బండేస్కొని ఓకాడ గూసున్న. ఇంకో బండ మీన మూతవెట్టిన. ఆ మూతలున్న అన్నం, దానిమీది మాడికాయ తొక్కు కనవడ్డదో మన్నో పక్కపొంటామెకు, ఆమె కడుపు సల్లగుండ. ‘ఓ అమ్మా.. పతాకం తొక్కుతోని ఏం దింటవ్, ఇగ వట్టు’ అని కొంచెం తమాట కూరేసింది. ఆమెను జూసి ఇంకొగామె గూడ ఇంత అంకాయ కూరేసింది. తెచ్చుకున్న సద్ది రెండు, మూడు కూరలతోని తినేసరికి లారీ లోడ్ యూరియా రానే అచ్చింది.
ఏడి గిన్నెలాడ వారేసి అందరు ఒక్కటే ఉరుకుడు. ఈ మోకాళ్లు పాడుగాను, నొప్పులొచ్చేసరికి వాళ్ల లెక్క నాకుర్క రాలె. మెల్లంగ వొయ్యేసరికి లైన్ రైలు డబ్బోలె నిలవడి ఉన్నది. అప్పటిదాన్క శెట్లకింద మంచిగ ముచ్చట వెట్టుకున్న మనుషులు ఆ యూరియా లోడ్‌ను సూడంగనే ‘నేనంటె నేను ముందు’ అని కొట్టుకున్నంత పన్జేసిర్రు. ‘ఎన్కో.. ముందో.. అందరికి మా అస్తది తియ్యరాదుర్రి యూరియా’ అని నేనంటే.. నా ఎన్కున్న ఓ పెద్దమనిషి.. ‘ఓ తల్లీ అచ్చింది లారీల కమాన యూరియా గాదు, ఒక్కటే లారీ లోడ్’ అని నోట్లె నోట్లె గునుగుతున్నడు. లైన్ల నిలవడి అప్పటికే రెండు గంటలాయె. నా పేరు ఎప్పుడొస్తదా అని నేను శెవులు దర్వాజ మొకానేసి ఎదురుజూస్తనే ఉన్న. నా పేరు ఇగ రాదు, అగ రాదు.
“నీ యూరియా సల్లగుండ! లచ్మీ… నేను మా దీస్కత్త తియ్యే అనంగ గూడ ఉరికితివి. ఇప్పుడేమైంది.. ‘నా పేరు పిలుస్తున్నరుల్లా, నా పేరు పిలుస్తున్నరుల్లా…’ అని కల్వరిచ్చుకుంటా మంచాన వడితివి” అని నా పెనిమిటి తిట్టవట్టిండు. అవును, ఆయన నన్నెందుకు తిడుతున్నడో తెలుసానుల్లా.. బుధారం రోజు సుసైటీల నా పేరు విల్శేదాకనే నాకు మతికున్నది. ఆ తర్వాతేమైందో నాకు తెల్వదు. ఎందుకంటే నాకు ముందే ఆస్తమా రోగమున్నది. అందున బుధారం నాడు లైన్ల అంతసేపు నిలవడేసరికి కండ్లకు శెక్కరొచ్చినట్టయి కింద కూలవడ్డనట. మా ఇంటాయెనకు అక్కడున్నోళ్లెవ్వలో శెప్తే.. నన్ను ఇంటికి తోల్కచ్చిండట!
– గడ్డం సతీష్ 99590 59041