స్వయం పాలన, ఆత్మాభిమానం కోసం; పీడిత, తాడిత జనాలపై వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన తెలంగాణ గడ్డ మరో పోరాటానికి సిద్ధమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధిక్కారానికి మారుపేరైన తెలంగాణ యువతరం ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కుతున్నది.
తెలంగాణ మొదటినుంచీ ప్రజా ఉద్యమాల గడ్డగా పేరుగాంచింది. 2009-2014 మధ్య జరిగిన తెలంగాణ సాధన ఉద్యమం యువత, సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. సీమాంధ్ర మీడియా కట్టడి చేసినా, సోషల్ మీడియా ప్రభావం అంతగా లేకపోయినా నాడు యువత గల్లీలను దాటి ఢిల్లీ కోటను బద్దలు కొట్టారు. ఇప్పుడు తరం మారింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాటి నూనూగు మీసాల యువతరం స్ఫూర్తితో ఇప్పుడు జనరేషన్-జెడ్ (1997-2012 మధ్య జన్మించినవారు) ఈ ఉద్యమాల జెండాను ముందుకు తీసుకెళ్తున్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిపై యుద్ధ భేరి మోగించడానికి సోషల్ మీడియా వేదికలు వీరికి శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుకు రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతున్నది. సర్కారు రెండు నెలలకోసారి నిర్వహిస్తున్న సర్వేల్లోనూ ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. రెండేండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో సర్కారుపై సమరభేరి మోగించేందుకు యువత సిద్ధమవుతున్నది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన ప్రజా ఉద్యమాలు, సోషల్ మీడియా, యువత ఐక్యతాశక్తిని నిరూపించిన ఘటనలను చూసి, తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులను యువత బేరీజు వేసుకుంటున్నది. ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లు యువతను సంఘటితం చేయడంలో, సమాచారాన్ని వేగంగా వ్యాప్తిచేయడంలో, నిరసనలను సమన్వయపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, హామీల అమల్లో వైఫల్యం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఉద్యోగ నియామకాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు పథకం, విద్యా, వైద్య సంస్కరణల్లో జాప్యం వంటి సమస్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. 2025 జనవరిలో తెలంగాణ కాంగ్రెస్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో ‘ఫామ్‌హౌస్ పాలన కావాలా? ప్రజల వద్దకు పాలన కావాలా?’ అని పోల్ నిర్వహించగా, 67% మంది ఫామ్‌హౌస్ పాలనకు ఓటు వేశారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో వచ్చిన వ్యతిరేకత సుప్రీంకోర్టు తలుపు తట్టింది. సీఎం సొంత నియోజకవర్గంలోని లగచర్లలో లంబాడీలపై సర్కారు దాష్టీకాన్ని, భూ దాహాన్ని ఇదే యువత, సోషల్ మీడియా ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగింది. అమీర్‌పేట, అశోక్‌నగర్ చౌరస్తాలో విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఇదే సామాజిక మాధ్యమం అండగా నిలిచింది. ఇక తాజాగా రాష్ట్రంలో ఎరువుల కొరతపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది సోషల్ మీడియా, యువతే. ‘గత పదేండ్లలో ఎరువుల కొరత లేనప్పుడు, ఇప్పుడు ఎందుకు సమస్య వచ్చింది?’ అంటూ యువత వల్లనే ప్రజా చైతన్యం వెల్లువలా సాగుతున్నది.
గతంలో సీఎం అమెరికా, దావోస్ పర్యటనల్లో చేసుకున్న స్వచ్ఛబయో కంపెనీతో జరిగిన ఫేక్ ఒప్పందాన్ని కూడా యువత, సోషల్ మీడియా బయటపెట్టాయి. ఇప్పటికీ ‘420 హామీలు’ అనే నినాదంతో కాంగ్రెస్‌ను యువత ట్రోల్ చేస్తూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. తెలంగాణలో జనరేషన్-జెడ్ యువత సోషల్ మీడియాను సర్కారు అవినీతిపై యుద్ధ భేరి మోగించే సమయం ఆసన్నమైంది. రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో యువత తమ డిమాండ్లను స్పష్టంగా వ్యక్తం చేయాలి.
#TelanganaForChange వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో క్యాంపెయిన్ ప్రారంభించడం, నిరసనలను లైవ్ స్ట్రీమ్ చేయడం, అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడం, తద్వారా ఉద్యమాలను బలోపేతం చేయవచ్చు. అంతేకాదు, యువత నిర్మాణాత్మక డిమాండ్లను ముందుకు తీసుకురావడం, విధాన నిర్ణేతలతో సంభాషణలు జరపడం, సమాజంలో సానుకూల మార్పులను ప్రోత్సహించడం ఇప్పుడు అవసరం. యువత ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొని బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను ఉపయోగించి, సమాజంలో శాశ్వతమైన మార్పులను సాధించాలి. యువ శక్తి, డిజిటల్ సాధనాలు కలిస్తే తెలంగాణ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది.
– (వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు)
పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి