నకిరేకల్, సెప్టెంబర్ 13: నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు శనివారం నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్‌గౌడ్, విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం… నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మూడు రోజులుగా డల్‌గా ఉంటూ ఏదో ఆలోచిస్తూ సరిగ్గా అన్నం తినడం లేదు.
గమనించిన ఆమె తండ్రి శుక్రవారం రాత్రి ఎందుకు డల్‌గా ఉన్నావని, ఏం జరిగిందని ప్రశ్నించారు. పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మూడు నెలల నుంచి తన సొంత జాయ్ వొకేషనల్ కాలేజీకి రావాలంటూ వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. ప్రతిరోజూ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొంది. విద్యార్థిని బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.
విద్యార్థినిపై ఉపాధ్యాయుడు మామిడి శ్రీనివాస్ అసభ్య ప్రవర్తించారని, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే సమాచారం రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికను డీఈవోకు పంపినట్లు ఎంఈవో మేకల నాగయ్య తెలిపారు. మీడియా ద్వారా వచ్చిన వార్త విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. తదుపరి విచారణ జరిపి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఈవో తెలిపినట్లు పేర్కొన్నారు.