ఓ సినిమాలో ‘మేరే పాస్ పైసా హై! బంగ్లా హై! గాడీ హై! నౌకర్ హై! బ్యాంక్ బ్యాలెన్స్ హై!’ అని అమితాబ్ బచ్చన్ చెబితే.. శశి కపూర్ ‘మేరే పాస్ మా హై’ అని సగర్వంగా చెప్పిన డైలాగ్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. రియాలిటీ ముందు మిగతావన్నీ దిగదుడుపే కదా మరి!! ఇప్పుడెందుకు ఈ డైలాగ్ అంటారా? యస్.. నేటి తరం జెన్-జెడ్ ఇప్పుడు డేటింగ్, పార్ట్నర్ ఎంపిక విషయంలో ఇదే డైలాగ్‌కి దగ్గరవుతున్నారు. రివర్స్ క్యాట్‌ఫిషింగ్ పేరుతో నిజాయతీని ఫాలో అవుతున్నారు. డేటింగ్ ప్రొఫైల్స్‌లో ఉన్నది ఉన్నట్టు చెబుతూ… షో-ఆఫ్‌కి చెక్ పెడుతున్నారు.
సాధారణంగా జెన్-జెడ్ లైఫ్‌ైస్టెల్ కాస్త భిన్నంగా ఉంటుంది. బ్యూటీ, ఫిట్నెస్, ఫ్యాషన్స్, ట్రెండ్స్.. వీటికే చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే ఈ నయా జమానా ఈ రూల్స్‌ని రివర్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కెరీర్, డేటింగ్ విషయాల్లో నిజాయతీగా ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ట్రెండ్‌కు కొత్త పేరు కూడా పెట్టారు. అదే ‘రివర్స్ క్యాట్‌ఫిషింగ్’. ఇంతకు ముందు డేటింగ్ ప్రొఫైల్స్‌లో అందరూ తమని తాము చాలా గొప్పగా, పర్ఫెక్ట్గా చూపించుకునేవారు. కానీ ‘రివర్స్ క్యాట్‌ఫిషింగ్’ దానికి పూర్తి ఆపోజిట్! డబ్బులు చూపించడం, కెరీర్ సక్సెస్ గురించి చెప్పడం, ఎడిట్ చేసిన సెల్ఫీలు పెట్టడం.. ఇవన్నీ ఈ ట్రెండ్‌లో కనిపించవు. ఇది మెస్సీగా ఉంటుంది. రియల్‌గా, ఫిల్టర్లు లేని ఫొటోలతో తమని తాము ఆవిష్కరించుకుంటున్నారు.
వాస్తవ ప్రపంచం నుంచి వర్చువల్ వరల్డ్‌లోకి వెళ్లింది మొదలు.. మొన్నటి మిలీనియల్స్, ఇప్పటి జెన్-జెడ్ కుర్రకారు ట్రెండింగ్ కోసం తెగ తాపత్రయపడుతుంటారు. ఫిల్టర్లు, ఫ్లెక్సింగ్, పర్ఫెక్ట్ పిక్స్‌తో సందడి చేస్తుంటారు. తమని తాము చాలా ైస్టెల్‌గా చూపించుకుంటారు. లేనివి ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు. అయితే, ఇప్పుడిది రివర్స్ అయింది. అంటే, తమ స్టేటస్‌ని, అందాన్ని కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నారు కొందరు. రియల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్ కనెక్షన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ డేటింగ్ యాప్ చేసిన ఒక సర్వే ప్రకారం.. ఇండియాలో ప్రతి ఐదుగురు జెన్-జెడ్ డేటర్లలో ఇద్దరు ‘రివర్స్ క్యాట్‌ఫిషింగ్’ని వాడుతున్నారట. 2025 ప్రారంభం నుంచి ఈ ట్రెండ్ నానాటికీ పెరుగుతున్నది. జెన్-జెడ్ యువత అన్ఫిల్టర్డ్ అథెంటిసిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
ఒకర్ని మెప్పించడం కోసం వారిది కాని ముసుగులు ధరించడం.. మాయ చేయడం.. అదే నిజమని నమ్మించడం సోషల్ మీడియాలో చాలామంది చేసే పనే. ఫిల్టర్లు, ఫేక్ పర్సనాలిటీలు, డబ్బు, ఆకర్షణ, ఫ్యాషన్స్, మేకప్‌లు.. వీటిని మోసీ మోసీ విసిగిపోయిన యువత క్రిస్టల్ క్లియర్‌గా ఉండాలని ఫిక్సవుతున్నది. దీన్నే ‘డిజిటల్ ఎగ్జాషన్’ అని పిలుస్తున్నారు.
‘పర్ఫెక్ట్ సెల్ఫీలు, లగ్జరీ వెకేషన్లు, డిజైనర్ వస్తువులను ఏళ్ల తరబడి చూస్తూ చూస్తూ అందరూ అలసిపోయారు. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. ఏది నిజమో? ఏది శాశ్వతమో? తెలుసుకుంటున్నారు. ఎందుకంటే.. నేటి జెన్-జెడ్ కిడ్స్ చాలా క్విక్‌గానే మార్పుని స్వీకరిస్తున్నారు. మానసిక పరిపక్వతకి ఓటు వేస్తున్నారు. ఫేక్ కల్చర్‌కి గుడ్ బై చెబుతున్నారు. ‘ఇన్స్టాగ్రామ్బుల్’ పోకడ వీడి.. లైఫ్‌ని గ్రాటిట్యూడ్‌తో చూడాలని కోరుకుంటున్నారు. అందుకే రివర్స్ క్యాట్ఫిషింగ్కు దగ్గరవుతున్నారు’ అని పలువురు సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.
నిజాల్ని నిర్మొహమాటంగా చెప్పే నేటి తరం.. ఈ ట్రెండ్‌ని మనుగడలోకి తేవడానికి మరో కారణం మితిమీరిన ఒత్తిడి. రెడీ అనగానే కెమెరా ముందు ఫేక్స్మైల్ ఇవ్వలేకపోతున్నారు. సోషల్ మీడియాలో సోగ్గాళ్ల ముసుగు ధరించలేకపోతున్నారు. ముఖ్యంగా లేనిపోని హెచ్చులు ప్రదర్శించి అందుకు తగ్గ పార్ట్నర్ని ఎంచుకుంటే మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తున్నారు. పక్కా ఫొటోలు, అతిశయోక్తులు లేని కచ్చితమైన ప్రొఫైల్‌తో డేటింగ్ యాప్‌లో అప్డేట్ అవుతున్నారు. తమకు తగ్గ అర్థవంతమైన ఎమోషనల్ కనెక్షన్ కోసం సెర్చిస్తున్నారు. కొందరు దీన్ని ఒక రకమైన డిజిటల్ సెల్ఫ్-కేర్ అని, డిజిటల్ డీటాక్స్ అని కూడా అంటున్నారు.
‘డేటింగ్ యాప్స్‌లో లేనిపోని విషయాలు ఊదరగొట్టి.. అందుకు తగ్గట్టుగా ఉండలేక ఒత్తిడికి గురవ్వడం కన్నా… సింపుల్‌గా, సాదాసీదాగా గడపడానికి ఓ కొత్త విండో ఓపెన్ చేస్తున్నాం’ అని చెబుతున్నాడు ప్రముఖ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తున్న విక్రాంత్. మొత్తంగా దేన్నీ ఎక్కువ చేసి చెప్పకపోవడం కొత్తరకం సోషల్ ‘ఫ్లెక్స్’ అంటున్నది జెన్-జెడ్! పైపై ఆకర్షణల కంటే కాస్త లోతుగా అర్థం చేసుకునే డేటింగ్ ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. ఇందుకోసం ‘ఇన్‌స్టా-వర్తీ’ లైఫ్ైస్టెల్కి ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. డిజిటల్ వరల్డ్‌లో షో-ఆఫ్‌కి తిలోదకాలిచ్చి… నిజాయతీగా నిలబడుతున్నారు.