నార్నూర్, అక్టోబర్ 21 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటలపాటు వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. వారం రోజులు వర్షం కురువకపోవడంతో మక్క, సోయా, మినుము, పెసరు వంటి పంటలు చేతికి వచ్చాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికి వచ్చే సమయంలో వర్షం కురవడంతో పత్తి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొంటున్నారు. కనీసం చేసిన అప్పులైన తీరుతాయో లేవో అని అనుమానంతో ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతు భరోసా ద్వారా ఆదుకుంటే యాసంగి పంట అయినా సాగు చేసుకోవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.