మంచిర్యాల, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనం ఇండ్లు విడిచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది. ఆదివారం సాయంత్రానికి గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్ మండలంలోని అర్లీ(టీ)లో అత్యధికంగా 133.8 మిల్లీ మీటర్లు, ఆదిలాబాద్(అర్బన్)లో 124.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో 128.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో 92.3, జైనథ్‌లో 90.4, తాంసిలో 88.0, బోథ్‌లో 87.6, సిరికొండలో 87.3, సొనాలలో 84.0, ఇంద్రవెల్లి, బజార్హత్నూర్, ఉట్నూర్, తలమడుగు మండలాల్లో భారీ వర్షం పడింది. నిర్మల్ జిల్లా భైంసాలో 89.3, కుంటాలలో 79.8, భైంసాలో 75.8, నిర్మల్‌లో 73.3 మిల్లీమీటర్లు.. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 87.8, కాగజ్‌నగర్ మండలంలోని జంబుగాలో 72.2, ఆసిఫాబాద్‌లో 71.0, లింగాపూర్, కెరిమెరిలో 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. జైపూర్ మండలంలో 60.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
నిండిన ప్రాజెక్టులు
మహారాష్ట్ర సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో ఆదివారం ఉదయం 10 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. సాయంత్రానికి ఇన్ ఫ్లో తగ్గడంతో ఐదు గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. రెండు గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఇక్కడ కూడా రెండు గేట్లను ఎత్తి 12 వేల క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు.
కడెం గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరిగింది. ఇన్ ఫ్లో 1,29,453 క్యూసెక్కులు ఉండగా, 20 గేట్లను ఎత్తి 1,44,870 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఎల్లంపల్లికి ఎగువ ప్రాంతం నుంచి అధిక వరదలు వస్తున్న దృష్ట్యా డ్యామ్ మీద వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి కూడా కిందికి నీటిని వదులుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా మత్తడి వాగు ప్రాజెక్టు, సాత్నాల ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో గేట్లను ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా.. పలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో పంట పొలాలు ముగినిపోయాయి. వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.