ఇంద్రవెల్లి, ఏప్రిల్ 5 : కేస్లాపూర్ నాగోబా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హీరాసుక జెండాను మార్చి 28న రాత్రి గుర్తు తెలియని దుండగులు తొలగించి దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు సగలకు చెందిన ఆదివాసీ గిరిజనులతో కేస్లాపూర్ నాగోబా దర్బార్హాల్లో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ పటేల్ అధ్యక్షతన చర్చ వేదిక నిర్వహించారు. హీరాసుక జెండా ఘటనతోపాటు కులదేవతల ప్రత్యేకతలు, సంప్రదాయ పూజలు, ఆదివాసులకు చెందిన ధర్మ గురువుల చరిత్రపై చర్చ వేదిక నిర్వహించారు.
కేస్లాపూర్ నాగోబా ఆలయ ఆవరణలో హీరాసుక జెండాను ఏర్పాటు చేయడం సరికాదని, తిరిగి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి తీర్మానం చేశారు. కాగా ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి నాగోబా దర్బార్హాల్లో జరుగుతున్న ఆదివాసుల చర్చ వేదికను పర్యవేక్షించారు. ఉట్నూర్ సీఐ మొగలి, ఎస్ఐ దుబ్బక సునీల్ ద్వారా సమాచారం తెలుసుకున్నారు.