చెన్నూర్ రూరల్, జూన్ 19 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఊరూరా నిర్వహించిన హరితోత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ.. బైక్ ర్యాలీలు తీశారు. హరితహారంపై అవగాహన కల్పించారు. పలుచోట్ల ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. అక్కడక్కడా వ్యాసరచన, ఉపన్యాస, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆటాపాటలతో హోరెత్తించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన హరితోత్సవం ఉత్సాహంగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. కిష్టంపేట సమీపంలోని అంబేద్కర్ అర్బన్ పార్కులో జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన హరితోత్సవంలో విప్ బాల్క సుమన్.. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్‌తో కలిసి పాల్గొన్నారు. హరితోత్సవం విజయాల పోస్టర్లు, వైల్డ్ లైఫ్ ఆఫ్ చెన్నూర్ ఫారెస్ట్ బుక్కులను ఆవిష్కరించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా కాటన్ సంచులను తయారు చేయించి సుమన్ చేతుల మీదుగా కిష్టంపేట గ్రామస్తులకు పంపిణీ చేయించారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. డీఎఫ్‌వో శివ్ ఆశిశ్‌సింగ్ పాల్గొన్నారు.
భీమారం, జూన్ 19 : భీమారం రేంజ్ పరిధిలో హరిత నిధి మోడల్ నర్సరీతోపాటు సీడ్ స్టోరేజ్ యూనిట్‌ను విప్ బాల్క సుమన్.. కలెక్టర్ సంతోష్, డీఎఫ్‌వో శివ్ ఆశిష్ సింగ్‌తో కలిసి ప్రారంభించారు. నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. ప్రతి మొక్కనూ బతికించాలని అధికారులకు సూచించారు.
లక్షెట్టిపేట రూరల్/లక్షెట్టిపేట జూన్ 19 : సూరారంలో నిర్వహించిన హరితోత్సవంలో కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొని మొక్కలు నాటారు. లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ రాహుల్, డీఎఫ్‌వో శివ్ ఆశిష్ సింగ్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి, జూన్ 19 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.
కాసిపేట, జూన్ 19 : దేవాపూర్, సోనాపూర్, గట్రావ్‌పల్లి, మద్దిమాడ గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే చిన్నయ్య పాల్గొని మొక్కలు నాటారు. ర్యాలీలో పాల్గొని హరితహారం ప్రాముఖ్యత గురించి వివరించారు.
ఆసిఫాబాద్, జూన్ 19 : జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సకు, కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సురేశ్‌కుమార్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పాల్గొన్నారు. అడవుల సంరక్షణ కోసం పాటు పడుతున్న అటవీశాఖ అధికారులను అభినందించారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో మొకల విశిష్టత గురించి పాటల ద్వారా అవగాహన కల్పించారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో రూపొందిస్తున్న లఘు చిత్రాన్ని ఆవిషరించారు. స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయం నుంచి సుభాష్‌చంద్రబోస్, కుమ్రం భీం చౌక్ల మీదుగా బైక్ ర్యాలీ తీశారు.
నిర్మల్ అర్బన్, జూన్ 19 : జిల్లా కేంద్రంలోని సోఫినగర్ కాలనీలో నిర్వహించిన సంబురాల్లో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొని రోడ్లకు ఇరువైపులా, డంప్ యార్డులో మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్డీపీటీ శర్వానన్, జిల్లా అటవీ అధికారి సునీల్ హెరామత్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్‌తో కలిసి మొక్కలు నాటారు.
మామడ, జూన్ 19 : లింగాపూర్‌లోని పొనికి వనంలో జరిగిన ఉత్సవంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. హరితహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఖానాపూర్ టౌన్, జూన్ 19 : పట్టణంలోని అర్బన్ పార్క్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొని మొక్కలు నాటారు. అధికారులతో కలిసి సఫారీ వాహనంలో అర్బన్ పార్క్‌లో పర్యటించారు. అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
కుంటాల, జూన్ 19 : కుంటాల మండల కేంద్రంతో పాటు దౌనెల్లి, కుంటాలపల్లెలో కనుల పండువగా ఉత్సవాలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మొక్కలు నాటారు.
నిర్మల్ అర్బన్, జూన్ 19 : జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. డీసీఆర్బీ డీఎస్పీ రవీందర్ రెడ్డి, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, రమేశ్, రామకృష్ణ ఉన్నారు.
తాంసి, జూన్ 19 : వడ్డాడిలో ఎమ్మెల్యే బాపురావ్ జడ్పీటీసీరాజుతో కలిసి సంపద వనాన్ని ప్రారంభించారు. రెండెకరాల్లో 2500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 19 : ఆదిలాబాద్ యాపల్గూడలోని రెండో పోలీస్ బెటాలియన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీని ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పోలీసులతో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ బెటాలియన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రగతి పథంలో సాగేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మావల హరితవనం పార్కులో ఎమ్మెల్యే జోగు రామన్న కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఎదులాపురం, జూన్19 : జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అదనపు ఎస్పీలతో కలిసి మొక్కలు నాటారు. అలాగే స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి స్థానిక బాలికల గురుకుల కళాశాలలో మొక్కలు నాటారు. అనంతరం జిల్లా పోలీసుల అన్ని కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటారు.
నేరడిగొండ, జూన్ 19 : మండల కేంద్రంలో హరితోత్సవం నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బైక్ ర్యాలీ ప్రారంభించారు. నేరడిగొండ నుంచి సోమన్న అర్బన్ పార్కు వరకు ర్యాలీ సాగింది.