మందమర్రి రూరల్, మార్చి 2 : మందమర్రి మండలం గుడిపెల్లి-కానుకూర్ రహదారి కంకరతేలి అధ్వానంగా మారగా, ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులంతా నిత్యం నరకం అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. శాసన సభ ఎన్నికల సమయంలో చిర్రకుంట నుంచి గుడిపెల్లి వరకు ఆర్అండ్బీ ఆధ్వర్యంలో తారురోడ్డు నిర్మించారు. జైపూర్ మండలం రసూల్‌పల్లి నుంచి కానుకూర్ వరకు తారు రోడ్డు చేపట్టారు. ఇక నిధుల కొరత సాకుగా చూపి గుడిపెల్లి నుంచి కానుకూర్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదు.
ఈ రహదారి గుండా శంకర్పల్లి, సారంగపల్లి, చిర్రకుంట, ఆదిల్పేట్, మామిడిగట్టు, పొన్నారం, వెంకటాపూర్ తదితర గ్రామాల ప్రజలు నియోజకవర్గ కేంద్రమైన చెన్నూర్‌కు, గోదావరిఖని, జిల్లా కేంద్రం మంచిర్యాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 2 కిలోమీటర్ల మేర కంకర తేలడంతో పాటు గుంతలు పడి ‘దారి’ద్య్రంగా మారగా, అనేక అవస్థలు పడుతున్నామని, వాహనాలు సైతం పాడైపోతున్నాయని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి సరిగా లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఈ రూట్లో బస్సులు కూడా నడపడం లేదని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఇకనైనా స్పందించాలి
గుడిపెల్లి నుంచి కానుకూర్ వరకు రోడ్డు అధ్వానంగా ఉంది. కంకరతేలి.. గుంతలు పడ్డాయి. ఈ రూట్లో ప్రయాణించాలి అంటే భయంగా ఉంది. ఇగ రాత్రి వేళల్లో అయితే చెప్పనక్కరలేదు. నిత్యం నరకం అనుభవిస్తున్నాం. వాహనాలు కూడా పాడైపోతున్నాయి. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి. వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి.
– పెంచాల మధు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు, పొన్నారం
నిత్యం ప్రమాదాలే..
గుడిపెల్లి-కానుకూర్ రోడ్డు బాగ లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డంతా కంకర తేలి ఉండడం వల్ల ద్విచక్ర వాహనదారులైతే అదుపుతప్పి పడిపోతున్నారు. రోడ్డు ఇలాగుంటే ప్రయాణించడం ఎలాగో అధికారులు చెప్పాలి. ఇన్ని రోజులైనా రోడ్డును బాగు చేయకపోవడం దారుణం. ఇకనైనా స్పందిస్తే బాగుంటుంది.
– వేల్పుల సాగర్, వెంకటాపూర్