తాండూర్ : కాంగ్రెస్ పార్టీ (Congress Party ) 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తాండూర్ మండలంలో రెండు చోట్ల వేరువేరుగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నేతల తీరు ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా ఉంది.

ఇటీవల బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఓ కార్యక్రమంలో పొడచూపిన గ్రూపు విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి గ్రూపు రాజకీయాలకు అవకాశం ఇవ్వొద్దని అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
మండలంలోని మాదారం టౌన్ షిప్ ఐఎన్టీయూసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగగా, తాండూరు మండల కేంద్రం ఐబీలో పార్టీ మండల అధ్యక్షుడు ఎండి ఈసా ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. దీంతో తటస్థంగా ఉన్న కార్యకర్తలు ఏ కార్యక్రమానికి హాజరు కావాలో తెలియక అయోమయానికి గురయ్యారు.