నిర్మల్ అర్బన్, డిసెంబర్ 14 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులతో సమీక్షలు నిర్వహించి లోటు పాట్లు లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హాల్ టికెట్లను వెబ్సైట్లో ఉంచారు.
నిమిషం నిబంధన ఉండడంతో గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుండగా.. ఉదయం 9.30 గంటలకే గేట్లను మూసివేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష ఉండగా.. 2.30 గంటలకే గేట్లు మూసివేస్తారు. బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు ఉండడంతో అభ్యర్థులు చేతులకు గోరింటాకు, మెహంది వంటివి పెట్టుకోవడం వల్ల బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు సరిగ్గా వచ్చే అవకాశం ఉండదు. అందుకోసం పెట్టుకోవద్దు.
కేంద్రాల్లోకి సెల్‌ఫోన్, స్మార్ట్ వాచ్, క్యాలిక్యూలేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. హాల్‌టికెట్‌పై ఫొటో అతికించుకోవాలి. ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు(ఓటర్, ఆధార్, పాన్, ఎంప్లాయీ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్)తో కేంద్రాలకు చేరుకోవాలి. కాగా.. కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా 163 సెక్షన్‌ను విధిస్తున్నామని, అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
ఎదులాపురం, డిసెంబర్ 14 : గ్రూప్-2 పరీక్షకు పటిష్ట బందోబస్తు చేపట్టినట్లు ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 29 సెంటర్లలో 10,428 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పరీక్ష సజావుగా జరిగేందుకు పోలీస్ శాఖ తరపున పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు గూమికూడి ఉండకూడదన్నారు. అత్యవసర సమయంలోనైనా అభ్యర్థులు డయల్ 100 ద్వారా పోలీసు యంత్రాంగం సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తుదారులు : 8,080
కేంద్రాలు : 24
చీఫ్ సూపరింటెండెంట్లు : 24
పరిశీలకులు : 26
డిపార్ట్మెంట్ అధికారులు : 26
ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు : 86
జాయింట్ రూట్ అధికారులు : 4
లోకల్ రూట్ అధికారులు : 4
ఫ్లయింగ్ స్కాడ్ సభ్యులు : 10
బయోమెట్రిక్ సిబ్బంది : 62
ఇన్విజిలేటర్లు : 337