మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి కేబినెట్ మీటింగ్లో మరిన్ని సాహోపేత మైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంతో అనేక మందికి ప్రయోజనం చేకూర్చగా, తాజాగా తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా వేలాది మంది పేదలకు ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నది. ఇంటి స్థలం ఉన్న వారికి రూ. 3 లక్షల చొప్పున అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి సాయమందించ నుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 30 వేల మంది(నియోజకవర్గానికి 3 వేల మందికి)కి మేలు జరగనున్నది.
నిజానికి ఇది వినూత్న పథకం. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి, అలాగే ఇల్లు కూలిపోయిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వెంటనే చేపట్టాలని ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులకు రూ. 3 లక్షలను మూడు దఫాలుగా రూ. లక్ష చొప్పున ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నది. సొంత స్థలం ఉంటే ఇండ్లు కట్టిస్తామని గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మాటకు కట్టుబడి ఈ పథకానికి అంకురార్పన చేశారు. ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఇండ్లు కట్టుకున్న వారి అప్పును సైతం మాఫీ చేయనున్నది. ఈ నేపథ్యంలో ఇండ్లు లేని పలువురి పేదలను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా, తమకు సర్కారు అందిస్తున్న వరమని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పేదోళ్ల కల నెరవేరుతది..
మా తాతముత్తాతలు.. ఎంత కష్టపడ్డరో గనీ.. ఇల్లు కట్టిండ్రు. ఇగ ఇప్పుడు పల్లె, పట్నం యాడన్న ఇల్లు జాగ కొనుడు, కట్టుడు మస్తు కష్టం. ఇలాంటి యాల్ల సీఎం కేసీఆర్ సారు గృహలక్ష్మి పథకం పెట్టుడు గరీబు, సరీబుకు సల్లటి మాట. భీంపూర్ మండలం ఆఖిరి ఊరు గుబ్డిల ఉంటం. మాకు జమాన్ల మట్టిగోడల ఇల్లు, గోదా గొడ్డు, గొర్రెలకు కొట్టం ఉన్నది. కాకపోతే పంట ఉత్పత్తులు, ఎవుసం సామాన్లతోటి మెస్లరాకుంట ఉన్నది. మట్టిగోడల ఇల్లు పనికి రాకుంట అయ్యింది. గా జాగలనే సర్కారు ఇస్తున్న సాయంతోటి కొంత కలుపుకొని ఇల్లు కట్టుకోవాలని ఉన్నది. నేనే గాదు గీ పథకం తోటి మా గ్రామంల మస్తుమంది సంతోష పడుతున్నరు.
– తూడి దత్తు యాదవ్, రైతు, గుబ్డి, భీంపూర్ మండలం
గరీబోళ్ల దేవుడు కేసీఆర్
నెన్నెల,మార్చి 10 : నా భర్త చనిపోయిండు. కొడుకు ఉన్నడు. ఎవుసం చేసుకుందామంటే గుంట భూమి లేదు. రోజూ కూలీ పనులకు పోతనే బుక్కెడు బువ్వ కడుపులకస్తది. ఇగ మాలాంటోళ్లు ఇల్లు ఎట్లా కట్టుకుంటరు. ఇప్పుడు చిన్న గుడిసెల ఉంటున్నం. వానపడితే మొత్తం నీళ్లే. మడుగు లెక్క అయితది. మస్తు తిప్పల పడుతున్నం. ఏనాటికైనా దేవుడు దయ చూపక పోతడా అని చూస్కుంట వచ్చినం. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారే దేవునోలె అయితండు. ఇండ్లులేని గరీబోళ్లకు పైసలిస్తమని చెప్పిండు. జాగ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలిస్తరట. నేను కూడా సార్లకు దరఖాస్తు పెట్టుకుంట. ఇల్లు కట్టుకుంటానన్న భరోసా వచ్చింది. – గొర్లపల్లి పార్వతి, నెన్నెల
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నం..
కూలీ పనులకు పోతేగాని పొట్టగడవని పరిస్థితి. ఇల్లు లేక గుడిసెలో ఉంటు న్నం. వాన కాలంలో ఇళ్లంతా ఉరు స్తున్నది. ఎండాకాలంలో కూడా బాగా ఇబ్బందవుతున్నది. నాకు సొంత జాగా ఉంది. ఇల్లు ఇప్పిం చాలని చాలా రోజులుగా అధికా రులను అడుగుతున్నం. మాకు ముగ్గురు ఆడ పిల్లలున్నారు. అందరికీ పెండ్లి చేసినం. గుడిసె కావడంతో వాళ్లు వచ్చిపోయినప్పుడు కష్టమవుతున్నది. ముఖ్య మంత్రి కేసీఆర్ సర్ గృహలక్ష్మి పథకం ద్వారా పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షలు ఇస్తమని చెప్పడం సంతోషంగా ఉంది. పేదల కష్టాన్ని గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్ సారు ఒక్కరే. – శంకుంతల, బోరిగామ, ఇచ్చోడ మండలం
పేదోళ్లకు అన్ని సౌలతులు చేస్తున్నది..
కేసీఆర్ సర్కారు పేదోళ్లకు అన్ని సౌలతులు చేస్తున్నది. ఇంతకు ముందు గరీబోళ్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పేదోళ్ల పరిస్థితి బాగుపడింది. రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నరు. ముసలోళ్లకు పింఛన్లు, ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, సర్కారు దవాఖానల్లో వైద్యసేవలు అందిస్తున్నరు. నాకు సొంత జాగా ఉంది. పైసలు లేకపోవడంతో పూరి గుడిసెలో ఉంటున్నం. వానకు తడిసి, ఎండకు ఎండుతున్నం. సొంత ఇల్లు కట్టుకుం దామంటే పైసల్లేకపాయె. కేసీఆర్ సర్ పేదోళ్లు ఇల్లు కట్టుకునేందుకు సాయం చేస్తామనడం సంతోషంగా ఉంది. – పడుతుల లక్ష్మి, బొరిగామ, ఇచ్చోడ మండలం
మా తాతముత్తాతల నుంచి గుడిసెల్నే..
మాది పెద్దంపేట గ్రామపంచాయతీలోని కొలాంగూడ. మా తాత ముత్తాతల నుంచి గుడిసెల్లోనే ఉంటున్నాం. వెదురు కట్టెలతో తడకలు కట్టి వాటి మీద తాటి కమ్మలు వేసుకునే ఉంటు న్నం. సొంతంగా ఇండ్లు కట్టుకునే స్తోమత లేదు. ఇక్కడ 42 గుడిసెలు ఉన్నాయి. కూలీనాలీ చేసుకొని బతు కుతం. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇండ్లు కట్టుకున్నోళ్లకు రూ.3 లక్షలిస్తరట. మే ము దరఖాస్తు పెట్టుకుంటం. పైసలు మంజూరు కాంగనే ఇల్లుకట్టుకుంటం.
– టేకం పోశన్న- రాజుభాయ్, పెద్దంపేట(కొలాంగూడ), మంచిర్యాల
సంతోషంగా ఉంది
నేను బీడీలు చుడుతుంట. నా భర్త కూలీగా పనులు చేస్తడు. మేముండేది చిన్న గుడిసె. సుట్టాలు ఎవ రైనా ఇంటికి వస్తే ఇల్లు సరిపోక బాగా ఇబ్బందవు తున్నది. వానకాలంలో వర్షాలు బాగా పడితే ఇంట్లోకి నీళ్లు వస్తాయి. సొంత జాగా ఉన్నా ఇలు సరిగా లేకపోవడంతో బాగా తకిలీబు అవుతున్న ది. పేదలకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇల్లులేని వారి కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకురావడం సంతోషంగా ఉంది. మాలాంటి పేదలకు ఎంతో సాయం చేసినట్లు అవుతుంది. సర్కారు అందిస్తున్న సాయంతో ఇల్లు కట్టుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. – శిల్ప, బోరిగామ, ఇచ్చోడ మండలు
సర్కారుకు రుణపడి ఉంటం
నేను ముసలిదాన్నైన. పుట్టి.. బుద్ధెరిగిన సంది గీ గుడిసెల్నే ఉంటున్న. రెండు, మూడేండ్లకోసారి తడకలు మార్చుకొని ఉంటున్నం. వానలు బాగా పడ్డప్పుడు ఇంట్లకు నీళ్లత్తయ్. మస్తు తిప్పలైతది. నా కొడుకు, కూతురు.. వాళ్ల సంతానం.. అందరం గిండ్లనే ఉంటున్నం. నేను పోయేలోపన్నా నా బిడ్డలు ఇండ్లు కట్టుకుంటే సూడాలనుకున్న. ఏనాటికైనా దేవుడు దయ సూపకపోతడా అనుకునే దాన్ని. గిప్పుడు సీఎం కేసీఆర్ సారే దేవునోలె అయితండు. ఇండ్లు కట్టుకునేటోళ్లకు రూ.3 లక్షలిస్తమని చెప్పిన్రు. దరఖాస్తు పెట్టుకుంటం. నాకున్న జాగలో పిల్లలిద్దరికీ ఇండ్లు పడుతయ్. ఒక్క ఇంట్ల ఇంత మందిమి ఉండలేక పోతున్నం. మాకు ఇండ్లు కట్టిస్తే గీ సర్కారోళ్లకు జీవితాంతం రుణపడి ఉంటం.
– టేకం అనిత, పెద్దంపేట(కొలాంగూడ), మంచిర్యాల
మేము కూడా ఇల్లు కట్టుకుంటం
కోటపల్లి, మార్చి 10 : నా పేరు దుర్గం లావణ్య. భర్త పేరు చిరంజీవి. మాది కోటపల్లి. నాకు ముగ్గురు పిల్లలు. పేద కుటుంబం. ఎవుసం పనులు చేసుకుని బతుకుతు న్నం. ఇద్దరం కలిసి పొద్దంత పన్జేసినా పూట గడువని పరిస్థితి. ఇల్లుకట్టుకునే స్థోమత లేదు. భర్త, అత్త, మామ, పిల్లలు ఇలా అందరం కలిసి చిన్న ఇంట్లో ఉంటున్నం. వానకా లంలో ఉరుస్తది. మస్తు తిప్పలై తంది. మాకు కొంత జాగ ఉంది. సర్కారోళ్లు ఇటీవల కొత్తగా గృహలక్ష్మి పథకం తీసుకొచ్చింన్రు. మా ఆడోళ్ల పేరు మీదనే డబ్బులిస్తమని చెప్పిన్రు. రూ. 3 లక్షలు ఇస్తరట. మేము కూడా దరఖాస్తు పెట్టుకుంటం. ఇగ మా సొంతింటి కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉంది. సర్కారోళ్లు ఇచ్చే పైసలకు ఇంకొన్ని కలుపుకొని మంచిగ ఇల్లు కట్టుకుంటం. ఇన్నేండ్లు పేదోళ్ల బాధలను పట్టించుకు న్నోళ్లు లేరు. సీఎం కేసీఆర్ అందరికీ మంచి చేస్తున్నడు.