మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 16 : దేశ వ్యాప్త కార్మికుల సమ్మె, భారత్ బంద్‌లో భాగంగా మంచిర్యాలలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్ర వారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి మంచిర్యాల రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా, కార్మిక సమస్యలు పట్టించుకోకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలను,
రైతులను, కార్మికులను, వ్యవసాయ కూలీలను ప్రమాదంలో నెట్టే చట్టాలను తీసుకువచ్చి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా బీజేపీ విధానాలున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి మేకల రామన్న, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోమాత ప్రకాశ్, గోమాత ప్రకాశ్, శ్రీనివాస్, లాల్‌కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కుమార్, బాపన్న, పోషం, హాస్పిటల్ వర్కర్స్, మధ్యాహ్న భోజన కార్మికులు, హాస్టల్ వర్కర్లు, హమాలీ కార్మికులు, స్కూల్ స్వీపర్లు తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, ఫిబ్రవరి 16 : మండలంలోని అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొని నిరసన తెలిపారు. పర్మినెంట్ చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐటీయూ మండల కార్యదర్శి కావెర రవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడె లక్ష్మి, సుభద్ర, రాజేశ్వరి, శంకరమ్మ, భారతి, శారద, ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, ఫిబ్రవరి16 : దేశ వ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. బస్టాండ్ ప్రాంతం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. రైతులు, కార్మికుల సమస్యల పరిష్కరించాలని కూలీలను ప్రమాదంలోకి నెట్టే చట్టాలను తీసుకువచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా చేస్తుందన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దినేశ్, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు ప్రసన్నకుమారి, తదితరులు ఉన్నారు.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 16: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన భారత్‌బంద్‌లో భాగంగా బెల్లంపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ శుక్రవారం పట్టణంలోని బజార్ ఏరియా నుంచి కాంటా చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. పెరుగుతున్న నిత్యావసర సరకులు, ఇతర ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రమణ, నాగరాజ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
-కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేసిన సీఐటీయూ
శ్రీరాంపూర్, ఫిబ్రవరి 16 : కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం దేశ వ్యాప్త గ్రామీణ, రైతు, కాంట్రాక్టు కార్మికుల సమ్మె నస్పూర్, శ్రీరాంపూర్‌లో పాక్షికంగా జరిగింది. కొన్ని వ్యాపార సముదాయాలు మినహా అన్ని రంగాలు సమ్మెకు దూరంగా ఉన్నాయి. శ్రీరాంపూర్, నస్పూర్‌లో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ నాయకులు నిరసన ఆందోళనలు చేపట్టారు. శ్రీరాంపూర్ ఏరియా గనులపై ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జే శంకర్రావు ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
సింగరేణి గనులు సంస్థకు అప్పగించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీసీసీ కార్నర్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, కే సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 కోడ్లకు తీసుకురావడాన్ని, బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నా రు.
శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌కుమార్, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్, శ్రీనివాస్, నవీన్, సదానందం, ప్రతాప్, బాలకృష్ణ, మహేందర్, లింగన్న పాల్గొన్నారు. ఏఐటీయూసీ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, నాయకులు లచ్చన్న, సారయ్య, నవీన్‌రెడ్డి, లచ్చిరెడ్డి, రవీందర్, కౌన్సిల ర్లు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్ పాల్గొన్నారు.