సోన్, డిసెంబర్ 5 : జిల్లావ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా గంటపాటు కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి మొదట్లో ఏపుగా పెరగడంతోపాటు పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంతోషించారు. తమ తమ కష్టాలు దూరమవుతాయని భావించారు. కానీ.. పొట్ట దశకు వచ్చే సరికి దోమ పోటు, ఎండుతెగులు, ఆకుముడత వంటి రోగాలు రావడంతో మందులను పిచికారీ చేశారు.
ప్రస్తుతం వరి సాగుకు ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుండగా.. అవి కూడా వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ కారణంగా వారం రోజుల నుంచి వాతావరణం అనుకూలించకపోగా.. గురువారం ఉదయం కొంచెం ఎండ వెళ్లడంతో సంబురంగా రైతులు ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా అనుకోకుండా గంటపాటు కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది.
నిర్మల్, సోన్ మండలంలోని ఆయా గ్రామాల్లోని వరిని సాగు చేయగా.. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. నిర్మల్ మండలం వెంగ్వాపేట్, చిట్యాల్, తల్వేద, మంజులాపూర్, ముజ్గి, ముఠాపూర్, సోన్ మండలంలోని కడ్తాల్ తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసినట్లు తెలిపారు. సుమారుగా గంటపాటు కురిసిన వర్షానికి నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలోని పేరుకుపోయిన ధాన్యం కుప్పలపైన రైతులు కప్పుకునేందుకునే తంటాలు పడ్డారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తూకం చేసి తరలించాలని రైతులు కోరుతున్నారు.