ఎదులాపురం/నిర్మల్ చైన్‌గేట్, మే 24 : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని నీటిపారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ధాన్యం కొనుగోళ్లు, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ.. అవసరమైన చోట హమాలీలను నియమించుకోవాలని, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాలు, తరుగు పేరిట ధాన్యంలో కోతలు విధిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వీసీలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ కలెక్టర్ భవేశ్‌మిశ్రా, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.