కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 24 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నది. అందుకనుగుణంగా 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండ గా, ఏప్రిల్ ఒకటి నుంచి మే 15వ తేదీ వరకు కొనుగోళ్లు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
సీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనుండగా, ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ. 2080, బీ-గ్రేడ్ రకానికి రూ. 2060 మద్దతు ధర ప్రకటించింది. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే యాసంగి ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయశాఖ, మార్కెటింగ్, రవాణాశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ తదితర వసతులు కల్పించాలని సూచించారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యంలో తాలు లేకుండా చూసుకోవడంతోపాటు 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన గోనె సంచులు సిద్ధం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచిధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచనున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు చెల్లించేలా చర్యలు చేపడుతున్నారు.
జిల్లాలో యాసంగి వరి కోతలు మరో వారంలో ప్రారంభం కానున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా బోర్ల కిందే ఆధారపడి పంటలు సాగుచేసే రైతులు ఉన్నారు. యాసంగి పంటల సమయంలో కరెంటు కోతలు విధించడంతో వరికి రైతులు కావాల్సిన సమయాల్లో నీళ్లు అందించలేక పోయారు. దీని ప్రభావం ధాన్యం దిగుబడిపై పడే అవకాశముంది.