రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను మిల్లుల ద్వారా బియ్యంగా మార్చి వాటిని పేదలకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ ప్రక్రియను కొందరు రైస్ మిల్లర్లు అక్రమ సంపాదనకు మార్గంగా మార్చుకుంటున్నారు. రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మిల్లులకు వచ్చిన వడ్లతో పాటు ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్లు దండుకుంటున్నాన్నారు. ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు రైస్‌మిల్లుల్లో అధికారుల తనిఖీల్లో వెల్లడైన లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)
ఏడాదికి రెండు సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు రైస్‌మిల్లర్లకు అప్పగిస్తున్నది. నిబంధనల ప్రకారం 67 శాతం బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కొంతమంది మిల్లర్లు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొంత మంది మిల్లర్లు వడ్లతో పాటు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రేషన్ షాపుల్లో నుంచి బియ్యాన్ని అక్రమంగా కొని వీటినే సీఎంఆర్ బియ్యంగా మారుస్తున్నారు.
చాలా మంది మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో చాలా మంది మిల్లర్లు రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ రైస్‌ని తిరిగి ఇవ్వలేదని తెలుస్తున్నది. పలు రైస్ మిల్లర్లు వ్యూహాత్యకంగా సిండికేట్‌గా మారి రబీ బియ్యాన్ని ఖరీఫ్‌కు, ఖరీఫ్ బియ్యాన్ని మళ్లీ రబీకి ఇలా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. రెండు సీజన్లు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని మిల్లుల యజమానులు సీఎంఆర్ బియ్యం ఎఫ్‌సీఐ అధికారులకు అందజేయడం లేదంటే వారి తీరు ఏవిధంగా ఉందో అర్థమవుతున్నది.
కోట్లాది రూపాయల ధాన్యం మాయం..
ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ మండలంలోని వెంకట్రావ్‌పేట్ లోని శ్రీ సాయిబాలాజీ రైస్ మిల్లులో దాదాపు రూ.4.45 కోట్ల విలువైన 17275క్వింటాళ్ల ధాన్యం, కౌటాలలోని వెంకటేశ్వర రైస్‌మిల్లులో రూ.3.50 కోట్ల విలువైన దాదాపు ధాన్యం మాయమైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మిల్లులకు ప్రభుత్వం అందించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చి ప్రభుత్వానికి సకాలంలో అప్పగించకుండా ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు తెలుస్తున్నది.
ఇది 2023-24 సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించింది. గత ఏడాది కూడా వెంకట్రావ్పేట్లోని రైస్ మిల్లుకు సం బంధించిన సీఎంఆర్ బియ్యం ఇలాగే పక్కదారి పట్టగా అధికారులు వాటిని మిల్లు యజమాని నుంచి రికవరీ చేశారు. తాజాగా ఇదే మి ల్లులో 2023-24 రబీకి సంబంధించిన రూ.4.50 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టినట్లు శనివారం జరిగిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. దహెగాంలోని వాసవి రైస్‌మిల్లులో కూడా రెండు నెలల క్రితం పట్టుబడ్డ 54 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కూడా ప్రవేట్ బియ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు.
కేసులు నమోదైన మిల్లులకే సీఎంఆర్..!
నిర్ణిత గడువులోపు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఏడాది పాటు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. జిల్లాలో కొన్ని రైస్‌మిల్లర్లు 2023-24లో సేకరించిన ధాన్యానికి సంబంధించి సీఎంఆర్ బియ్యాన్ని ఇంతరకు చెల్లించలేదు. ఇటీవల కౌటాల, వెంకట్రావ్పేట్లలోని రైస్‌మిల్లుల్లో అధికారులు తనిఖీచేసి 2023-24 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టిన గుర్తించారు. మిల్లులపై దాడులు చేసి అక్రమాలను గుర్తిస్తున్న అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. కాని మళ్లీ అవే రైస్‌మిల్లులకు మళ్లీ ధాన్యాన్ని కేటాయించడం గమనార్హం. దీంతో బియ్యం అక్రమ రవాణాలకు అలవాటుపడిన మిల్లర్లు ఎలాంటి జంకులేకుండా ఇష్టారాజ్యంగా బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.