మంచిర్యాల, జూలై 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయింది. పూటకో మాట మారుస్తూ జనాలను గందరగోళంలో పడేస్తున్నది. రుణమాఫీ చేసి రైతులకు ఊరట కలిగిస్తుందనుకుంటే కొద్ది మందికే మాఫీ చేసి చేతులు దులుపుకున్నది. లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేసి, ఆ తరువాత మాఫీ చేయకుంటే మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మాట మార్చినట్లే అప్పుడూ ఏదో కారణం చెప్తే ఏం చేసేదని ఆందోళన చెందుతున్నారు. కుటుంబమే యూనిట్‌గా తీసుకుని రుణాలను రద్దు చేయడం ద్వారా చాలా మందికి నష్టం వాటిల్లుతున్నది.
కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ అమలు కాగా.. మార్గదర్శకాల పేరిట, సాంకేతిక కారణాలతో చాలా మందికి నష్టం వాటిల్లనున్నది. సాగు కోసం తీసుకున్న అప్పులు కాంగ్రెస్ సర్కారు రద్దు చేస్తున్నదని అన్నదాతలు పెట్టుకున్న ఆశలు గల్లంతవుతున్నాయి. తొలి విడుతలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 96,043 రైతు కుటుంబాలకు రుణమాఫీని వర్తింపజేశారు. కానీ.. రుణాలు తీసుకున్న వారి సంఖ్య ఇప్పుడు చేసిన మాఫీ కంటే మూడు, నాలుగింతలు ఎక్కువగా ఉంది. ఇందులో చిన్న, సన్నకారు రైతులు చాలా మంది రుణమాఫీ రాదని తెలిసి తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. రైతులకు రుణభారాన్ని తగ్గించడాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన సర్కారు చేతులు దులుపుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతు ప్రయోజనాలను విస్మరించి ఇచ్చిన హామీని అమలు చేశామని చెప్పుకునేందుకే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినట్లు ఉంది. మార్గదర్శకాల పేరిట చాలా మంది రైతులకు రుణమాఫీ ఫలాలు అందకుండా చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన అర్హతలు, రేషన్ కార్డును ప్రామాణికమని చెప్పి ప్రతి గ్రామంలో 25 శాతం నుంచి 30 శాతం మందికే తొలి విడుతలో రుణమాఫీ చేసింది. ఒక కుటుంబంలో ఒకరికే రుణమాఫీ నిబంధనతో చాలా మంది నష్టపోయారు. కుటుంబంలో ముగ్గురు తీసుకుందామనుకుందాం.. ఈ ముగ్గురిలో ఒకరు రూ.50 వేలు, మరొకరు రూ.30 వేలు, ఇంకొకరు రూ.30 వేలు పంట రుణం తీసుకుంటే ముగ్గురి రుణం కలిపి రూ.1.10 లక్షలు అవుతున్నది. లక్షలోపు రుణమాఫీతో ముగ్గురిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ వర్తించడం లేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో కార్డులు తీసుకోకుండా జాయింట్ ఫ్యామిలీలో ఉన్న వారు కూడా నష్టపోయారు. కిసాన్ సమ్మాన్ యోజ న నిబంధనలు వర్తింపచేయడంతో ఐటీ చెల్లింపుదారులకు షాక్ తగిలింది.
రైతులకు రూ.2 లక్షల రూపాయల స్వల్పకాలిక రుణమాఫీ హామీ అటకెక్కింది. బ్యాంక్ రుణాలు, రేషన్‌కార్డులను లింక్ చేసి రైతు రుణమా రైతుల రుణమాఫీని కుటుంబ రుణమాఫీగా మార్చేశారు. ఇంతవరకు ఏ రుణమాఫీలో పెట్టని నిబంధనలకు తెరలేపిన అప్రదిష్టను కాంగ్రెస్ సర్కారు మూటగట్టుకుంది. కుటుంబం అనే నిబంధనతో చాలా మందిని నష్టం వాటిల్లింది. కొత్త రేషన్‌కార్డులు రాక, పాత వాటిలో మార్పులు-చేర్పులకు అవకాశం లేక విడిపోయిన రైతు కుటుంబాల పేర్లు ఒకే కార్డులో ఉన్నాయి. దీంతో ఉమ్మడి కుటుంబంలో విడివిడిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి తీవ్ర నష్టం జరిగింది. రీ-షెడ్యూల్ చేసిన పంట అప్పులకు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు కింద రుణమాఫీ వర్తించదని చెప్పడంతో మరికొంత మందికి రుణమాఫీ కోతలు తప్పడం లేదు.
జిల్లాలవారీగా తొలి విడుత రూ.లక్ష లోపు రుణమాఫీ రైతుల జాబితాను విడుదల చేసిన అధికారులు, అసలు లక్షలోపు రుణం తీసుకున్నవా రు ఎంతమంది ఉన్నారంటే మాత్రం చెప్పడం లేదు. అలాంటి జాబితానే లేదని చెప్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులను అడిగితే లీడ్ బ్యాంక్ వారిని లేదా బ్యాంకర్లను అడగమని చెప్తున్నారు. బ్యాంకర్లను అడిగితే వ్యవసాయశాఖ నుంచి వచ్చిన జాబితా మేరకు రుణమా ఫీ చేస్తున్నామని, ఇందులో తమరోల్ నామమాత్రమని చెప్తున్నారు. ఎవరికి వారు తప్పించుకునే సమాధానాలు తప్పితే ఎవ్వరూ స్పష్ట త ఇవ్వకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకున్నది. మరి ఇప్పటికైనా ప్రభు త్వం రుణమాఫీ కాని రైతులకు ఎందుకు మాఫీ చేయలేదనే వివరణ ఇస్తుందా? లేకపోతే మలి విడుతలో అవకాశం కల్పిస్తుందా? అనే విషయంపై స్పష్టత కరువైంది.
కేసీఆర్ సర్కారు హయాంలో షరతుల్లేకుండా రుణమాఫీ చేశారు. గుంట భూమి ఉండి రు ణం తీసుకున్న వారిని రైతులుగా పరిగణించి రుణమాఫీ చేశారు. రైతుబంధుతో పంటకు పెట్టుబడి సాయం అందించి పెద్ద మనసును చాటుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మా ఫీ చేశారు. కానీ.. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు రైతులను దగాకు గురి చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో ఇలాంటి షరతుల గురించి చెప్పకుండా ఇప్పుడు నిబంధనల పేరిట ప్లేట్ ఫిరాయించింది. పీసీసీ హోదాలో రేవంత్‌రెడ్డి రూ.2 లక్షలోపు రుణాలు తెచ్చుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని ప్రకటించారు. డిసెంబర్లో ప్రమాణ స్వీకారం కాగానే రుణ బాధలు తొలిగిస్తామని చెప్పారు. అనేక వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు నిబంధనల పేరిట రైతులకు న్యాయంగా దక్కాల్సిన రుణమాఫీకి అనేక కోతలు పెడుతున్నారు.
చెన్నూర్ రూరల్, జూలై 18 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ కాంగ్రెస్‌లో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. గురువారం స్థానిక రైతు వేదికలో రుణమాఫీపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏవో శ్రీనివాస్, మాజీ జడ్పీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మణ్ చల్ల రాంరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం రుణమాఫీ సంబురాల్లో భాగంగా కొందరు కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేసేందుకు సిద్ధమవుతుండగా, మాజీ జడ్పీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి అక్కడికి చేరుకొని అడ్డుకున్నాడు. తనకు చెప్పకుండా.. సంబురాలు ఎవరు చేయమన్నారంటూ అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అయిత హిమవంత రెడ్డిపై మండిపడ్డాడు. పాలాభిషేకం కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ గొడవకు దిగాడు.
నాయకులను ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు సమాచారం. ఎన్నికలప్పటి నుంచి ఈ నాయకుడి ఆగడాలు మితిమీరి పోతున్నాయని, ఎన్నిసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుందని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్రికల్లో కూడా ఈ నాయకుడి ఆగడాలపై కథనాలు వచ్చాయని వారు పేర్కొన్నారు. ఈ నాయకుడి వల్ల చెన్నూర్ పట్టణానికి చెందిన పులువరు ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు ఇటీవల బీజేపీలో చేరారని తెలిపారు. డబ్బులు వసూళ్లు చేయడం, బియ్యం, ఇసుక దందా చేయడంవంటివి చేస్తున్నా.. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంపై కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సదరు నాయకుడి ఆగడాలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని నాయకులు మాట్లాడుకోవడం గమనార్హం.
దండేపల్లి, జూలై 18 : మండల కేంద్రంలోని ద్వారక రైతువేదికలో రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పర్చువల్ విధానం ద్వారా ప్రారంభించిన నేపథ్యంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్‌రావు వీసీ ద్వారా తిలకించారు. అంతకుముందు ఎడ్ల బండ్లతో ర్యాలీ తీశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్ర మార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చిత్రప టాలకు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరు పుకున్నారు. గిరిజన కో ఆపరేటీవ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ డీఏవో సురేఖ, మండల ప్రత్యేకాధికారి రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో ప్రసాద్, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ గడ్డం నాగారాని-త్రిమూర్తి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అక్కల వెంకటేశ్వర్లు, కంది సతీష్‌కుమార్, ఏవో అంజిత్‌కుమార్, ఏపీవో దుర్గాదాస్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్ : నేను 30 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. నాపేరు మీద ఎకరం 10 గుంటల భూమి ఉంది. నేను గ్రామీణ బ్యాంకులో రూ.25 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. ప్రభుత్వం చేసిన లక్ష రుణమాఫీలో నాపేరు లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం మాఫీ చేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని, ఇప్పుడు మాలాంటి పేద రైతులకు రుణమాఫీ చేయలేదు. మేము యేటా బ్యాంకులో రుణం తీసుకుంటూ కడుతున్నాం. మేము ఉద్యోగాలు చేయడం లేదు. ఐటీలు కట్టడంలేదు. మాలాంటి రైతులకు కాకుంటే ఎవరికీ రుణమాఫీ చేస్తారో అర్థం కావడం లేదు. ప్రభుత్వం సర్వే నిర్వహించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
– చందనగిరి రాజేశ్వర్, రైతు, కొత్తగూడ గ్రామం.
ఖానాపూర్, జూలై 18 : రేషన్‌కార్డు కచ్చితంగా అని చెప్పి రుణ మాఫీ చేయకపోవడం సరైన నిర్ణయం కాదు. నేను ఐదేండ్ల నాకున్న మూడెకరాల భూమిలో ఎవుసం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మూడేండ్ల క్రితం ఖానాపూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.90 వేల పంట రుణం తీసుకున్నా. కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి గురువారం లక్షలోపు పంట రుణం మాఫీ చేసిన లిస్టులో నా పేరు లేదు. ఈ ప్రభుత్వం నాలాంటి రైతులకు రుణమాఫీ చేయకుండా తీవ్ర అన్యాయం చేసింది. సర్కారు మాలాంటి రైతులపై దృష్టి సారించి రుణమాఫీ చేయాలని కోరుతున్నా.
బావు రవి, రైతు, తర్లపాడు, ఖానాపూర్ మండలం