కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన ‘నీలి విప్లవం’పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జలాశయాల్లో చేప పిల్లలు వేయాల్సిన సమయం దాటిపోతున్నా ఆ ఉసే ఎత్తకపోవడం అయోమయానికి గురి చేస్తున్నది. ప్రతిష్టాత్మక పథకానికి మంగళం పాడినట్లే స్పష్టమవుతుండగా, చేపలు పట్టే కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి దాపురిస్తున్నది.
బీఆర్ఎస్ సర్కారులో చేప పిల్లల పెంపకం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 60 మత్స్య సహకార సంఘాలకుగాను 2750 మంది సభ్యులు ఉన్నారు. కుమ్రం భీం ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు మరో 350 మంది లైసెన్స్లు కలిగిన వారు ఉన్నారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా దాదాపు 5 వేల కుంటుంబాలు చేపల వేటే జీవనాధారంగా జీవిస్తున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో ఏటా జిల్లాలోని 254 చిన్న, పెద్ద చెరువులు, నాలుగు రిజర్వాయర్లలో కోటీ 38 లక్షల చేప పిల్లలను వదులుతూ వచ్చారు. ఎనిమిదేళ్లపాటు జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లల పెంపకం చేపట్టగా, ఏటా ప్రతి మత్స్యకారుని కుటుంబానికి రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం సమకూరింది. ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రతి కుటుంబానికి ఆదాయం సమకూరుతూ వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంగళం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేప పిల్లల పంపిణీలో జాప్యం చేస్తున్నది. చేప పిల్లల పంపిణీకోసం మార్చిలో టెండర్లు నిర్వహించి.. ఆగస్టులో చేప పిల్లలను నీటి వనరుల్లో వేయాల్సి ఉంటుంది. చేప పిల్లల పంపిణీ కోసం మార్చిలో చేపట్టాల్సిన టెండర్లు ఇప్పటి వరకూ నిర్వహించలేదు. అసలు ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ ఉంటుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల దాటిన తర్వాత చేప పిల్లలు వేసినా దిగుబడిపై ప్రభావం ఉంటుందని, సకాలంలో చేప పిల్లలు వేయకపోవడం వల్ల సరైన ఎదుగుదల లేక దిగుబడి బాగా తగ్గే అవకాశముంటుందని మత్స్యకారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించాలని వారు కోరుతున్నారు.