మంచిర్యాల ప్రతినిధి, సీసీసీ నస్పూర్, డిసెంబర్ 17 : నస్పూర్‌లోని సర్వే నంబర్ 42లోగల ప్ర భుత్వ భూమి కబ్జాకు కొందరు యత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. నకిలీ పత్రాలు సృష్టించి.. సర్వే నంబర్‌ను మార్చేసి 6 గుంటలు స్వాహా చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలుండగా, ఇందుకు ‘హస్తం’ పార్టీ నేతలు, అధికారులు సహకరిస్తున్నారనే ప్రచారమవుతున్నది.
నస్పూర్‌లోని సర్వే నంబర్ 42లోని భూములు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఈ సర్వే నంబర్లోని భూముల చిక్కుముడులు చాలా ఏళ్లుగా విడదీయరాకుండా ఉంటున్నాయి. ఒక్కో భూమిపై నలుగురు.. అంతకంటే ఎక్కువగా మంది డాక్యుమెంట్లు సృష్టించారు. విలువైన ఇక్కడి ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు జరిగిపోగా, ఉన్న భూములను కాపాడడం కష్టంగా మారుతున్నది. నస్పూర్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయం సమీపంలో గల సర్వే నంబర్ 42లో 6 గుంటల ప్రభుత్వ భూమి ఉంది.
ఈ భూమిపై కొందరు నకిలీ పత్రాలు సృష్టించి, ఏకంగా సర్వే నంబర్‌ను మార్చి కొట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. 42 సర్వే నంబర్‌ను 43 చేసి నకిలీ పత్రాలతో అధికారుల కళ్లుగప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ప్రభుత్వ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ప్రహరీ నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు ఉన్నాయా.. ఒకవేళ లేకుంటే ఎందుకు కూల్చివేయడం లేదు.. అనుమతులు ఇచ్చి ఉంటే ప్రభుత్వ భూమిలో ఎలా ఇస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఇదంతా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది.
కబ్జాకు గురవుతున్న సర్వే నంబర్ 42లోని భూమిపై పకడ్బందీగా సర్వే నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సర్వేనంబర్ 43 ప్రైవేట్ ల్యాండ్‌లో అప్పటి గ్రామ పంచాయతీ హయాంలో లే అవుట్ వెంచర్ ఏర్పాటు చేశారు. దీని కోసం అధికారులు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్లో గ్రామ పంచాయతీకి కొంత భూమిని కేటాయించారు. ప్రస్తుతం అందులో మున్సిపల్ నర్సరీని ఏర్పాటు చేశారు. దీన్ని ఆనుకొని సర్వేనంబర్ 42 భూమి ఉంది. అయితే నర్సరీ పక్కనున్న 42 సర్వే నంబర్లో ఉన్న 6 గుంటల భూమి 43 సర్వేనంబర్‌లో ఉన్నట్లు పత్రాలు సృష్టించారు.
రెవెన్యూ అధికారులు సైతం సర్వే చేసి 43లోనే ఉన్నట్లు గుర్తించారు. హద్దులు సక్రమంగానే ఉన్నాయని అంటున్నారు. గతంలో సర్వేచేసిన హద్దులు.. ప్రస్తుతం చేసిన సర్వే హద్దుల్లో నిజమెంత అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులకు అధికార పార్టీ పెద్దల అండదండలు ఉండడంతోనే వీరికి మార్గం సుగమం అయిందని, వీరికి అధికారులు కూడా సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఈ భూమిని నస్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఇదే ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మినట్లు తెలుస్తున్నది. కొన్ని కారణాలతో భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యక్తి మళ్లీ తాను ఈ భూమిని కొనుగోలు చేయనని, తాను ఇచ్చిన నగదును వాపస్ తీసుకున్నట్లు తెలిసింది.
నస్పూర్‌లో కలెక్టరేట్ నిర్మించడంతో అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావిస్తున్న రియల్ ఎస్టేట్వ్యాపారులు ప్రభుత్వ అసైన్డ్ భూములపై కన్నేస్తున్నారు. ప్రైవేట్ భూమి పక్కన ప్రభుత్వ భూములుంటే నకిలీ పత్రాలు సృష్టించి వాటిని కలిపేసుకుంటున్నారు. దీనికి అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ ప్రాంతంలో జోరుగా సాగింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో రియల్ వ్యాపారాలకు గడ్డుకాలం వచ్చింది. దీంతో ప్రైవేట్ భూములు కాకుండా చిక్కులున్న అసైన్డ్ భూములపై కన్నేయడం, ప్రైవేట్ పట్టా భూములను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కలుపుకుని సొమ్ముచేసుకోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సర్వే నంబర్ 43లోని భూమిపై అవసరమైతే మరోసారి సర్వే చేస్తాం. దీనిపై ఇది వరకే తమ సిబ్బందితో సర్వే చేయించాను. స్వయంగా నేనే సర్వేను పరిశీలించాను. ఈ భూమి సర్వే నంబర్ 42లో లేదు. మాపై ఎవరి ఒత్తిడిలేదు. భూమి యజమానులను పిలిపించి వారి డాక్యుమెంట్లను పరిశీలిస్తాను. ఇందులో ఏదైనా తేడా కనిపిస్తే మరోసారి సర్వే చేపిస్తాను. ప్రభుత్వ భూములను కాపాడడమే మా లక్ష్యం. కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టం.
– శ్రీనివాస్, నస్పూర్ తహసీల్దార్