ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సర్కారు ఒక అడుగు ముందుకేసింది. ‘రోగాలు రాకుండా చూడడం, వస్తే త్వరగా ఎలా నయం చేయాలి’ అనే ఉద్దేశంతో ఆయుష్ కేంద్రాలను వెల్నెస్ సెంటర్స్‌గా మారుస్తూ తాజాగా ఉత్తుర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని ఆయుర్వేదం, హోమియో, యునాని కేంద్రాలన్నీ కూడా వెల్నెస్ కేంద్రాలుగా మారనున్నాయి. ఇందులో ఆయుర్వేద వైద్యంతోపాటు యోగా, ఆరోగ్యసూత్రాలు, ఆరోగ్యభద్రత, అధునాతన వైద్యం అందించనున్నారు. ఒక్కో సెంటర్‌కు రూ.6 లక్షలు కేటాయించగా.. 42 దవాఖానలకు రూ.2.52 కోట్లు మంజూరయ్యాయి. వీటితోపాటు ఒక వైద్యుడు, ఇద్దరు యోగా శిక్షకులు, ఒక అటెండర్‌ను నియమించనున్నారు. ఫలితంగా ఉద్యోగావకాశాలూ పెరుగనున్నాయి.
నిర్మల్ టౌన్, మార్చి 5 : ఆయుర్వేద వైద్యానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఈ క్రమంలో సర్కారు కూడా ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ మేరకు ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుర్వేదం, హోమియో, యునానీ దవాఖానల్లో నేషనల్ వైద్యంతోపాటు యోగా వంటివి నేర్పించేందుకు వెల్నెస్ సెంటర్స్‌గా మారుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 42 డిస్పెన్సరీలు ఉండగా.. ఇందులో ఆయుష్ 27, హోమియో 6, యునానీ 9 కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 9, ఆదిలాబాద్ 9, కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో 6, నిర్మల్‌లో 3 ఆయుష్ వైద్యశాలలుండగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో రెండు, ఆదిలాబాద్‌లో 2, నిర్మల్‌లో 4 హోమియో కేంద్రాలు ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ 2, మంచిర్యాలలో 3, ఆదిలాబాద్‌లో 1, నిర్మల్‌లో 4 యునానీ దవాఖానలు ఉండగా.. వీటన్నింటినీ వెల్నెస్ సెంటర్లుగా మార్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయుష్ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుర్వేద వైద్యశాలల్లో ప్రస్తుతం ఆయుర్వేద మందులు, ప్రకృతి చికిత్స అందిస్తున్నారు. ప్రజలకు అంటురోగాలు రాకుండా, వస్తే నయం చేయడానికి వెల్నెస్ సెంటర్లు ఉపయోగపడుతాయని ప్రభుత్వం బావిస్తున్నది. ఇందులో భాగంగా ప్రతీ చోట వైద్యునితోపాటు ఇద్దరు యోగా శిక్షకులు, ఒక అటెండర్‌ను నియమించనున్నది. ఫలితంగా 150 మందికి కొత్త ఉద్యోగాలు రానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఒక్కొక్క వెల్నెస్ సెంటర్‌కు రూ.6 లక్షలు కేటాయించగా.. 42 సెంటర్లకు రూ.2.52 కోట్లు మంజూరయ్యాయి. యోగా నిర్వహణకు షెడ్డు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విశ్రాంతి గది, చికిత్స తీసుకోవడానికి సామాజిక వాతావరణం, కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజూ ఆయుర్వేద వైద్యశాల్లో 25 వేల మంది ఔట్ పేషెంట్లుగా చికిత్స అందుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇందులో ప్రధానంగా బీపీ, షుగర్, మోకాళ్లు, ఒళ్లు నొప్పులు, మానసిక ఒత్తిడి వంటి వ్యాధులకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని చూస్తున్నది.
20 ఏళ్ల నుంచి ఆయుష్ వైద్యశాఖలో పని చేస్తున్నా. సర్కారు మందులకు నయం కాని రోగాలు ఆయుర్వేద వైద్యంలో మూలికలు, గోలీలు, ద్రవ పదార్థాల వల్ల తక్కువ అవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఈ మందులపై విశ్వాసం ఉంది. రోజూ ఆయుష్ కేంద్రానికి వచ్చే గిరిజనులు గోలీలు ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పుడు ఆయుర్వేద కేంద్రాలకు కొత్త డాక్టర్లను నియమించడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది.
– నర్సారెడ్డి, ఫార్మాసిస్టు, సిర్పూర్ (యు)
సర్కారు మందులకు నయం కాని జబ్బులు యోగాతో నయమవుతాయి. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో యోగాసనాలు చేయడం వల్ల మానసిక రుగ్మతలతోపాటు మానసికో ల్లాసం కలిగి ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యం గా యోగా తో జ్ఞాపకశక్తి, ఆరోగ్యభద్రత పెరుగుతుంది. ప్రస్తుతం యోగా శిక్షణ ఇస్తున్న వారికి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి యోగా శిక్షణ ఇవ్వడం వల్ల ఎందరో మందికి ఉపాధి దొరకనుంది. – అన్నపూర్ణ, యోగా సీనియర్ శిక్షకురాలు, నిర్మల్
భారతీయ సమాజంలో ప్రాచీన వైద్యానికి మంచి గుర్తింపు ఉంది. ఇంగ్లిష్ మెడిసిన్‌తోపాటు ఆయుర్వేద మందులు కూడా ప్రజల ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే వెల్నెస్ సెంటర్లలో మూలికా వైద్యంతోపాటు యోగా, ఆరోగ్యసూత్రాలు అందిస్తాం. ఫలితంగా ఆయుర్వేద వైద్యంపై ప్రజలకు విశ్వాసం కలుగుతది.- డాక్టర్ గంగదాసు, నిర్మల్.