ఆదిలాబాద్ టౌన్, జనవరి 1 : ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి సూపర్ లగ్జరీ బస్సును ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు బస్‌లోని సౌకర్యాలను పరిశీలించి సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్సు ప్రతిరోజూ ఉదయం 4.45 నిమిషాలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరి జేబీఎస్‌కు 10.50 నిమిషాలకు చేరుకుంటుందని, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం రూ.40 లక్షల వ్యయంతో నూతన బస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్నీ బస్సులు కూడా రానున్నాయని పేర్కొన్నారు. సంస్థను నష్టాల నుంచి లాభాల బాటలో పయనించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలను అందేలా చూస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డిప్యూటీ ఆర్ఎం సురేశ్ చౌహాన్, డీఎం కల్పన, ఎంఎఫ్ రాజేందర్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్, అకౌంటెంట్ మోహన్, రిజర్వేషన్ ఇన్చార్జి సయ్యద్ అహ్మద్ హుస్సేన్, ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
దళితుల అభ్యన్నతే ధ్యేయం..
దళితుల అభ్యున్నతి, ఆర్థికంగా ఎదిగేందుకే రాష్ట్రం ప్రభుత్వం దళితబస్తీ, దళితబంధు పథకాలు అమలు చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని భూక్తపూర్లో గల బుద్ధ విహార్‌లో భీమా కొరేగావ్ శౌర్య దివస్ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ నగేశ్‌తో కలిసి ఆదివారం హాజరయ్యారు. ముందుగా 1818లో జరిగిన యుద్ధంలో అమరులైన వీరులకు ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ , బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రత్యేకపూజలు చేసి పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి విద్య తప్పనిసరి అని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. అనంతరం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఇతర రాష్ట్రాల్లో నివసించే వారు చర్చించాలని సూచించారు. కార్యక్రమంలో దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, రత్నజాడే ప్రజ్ఞాకుమార్, సొగల సుదర్శన్, శైలేందర్ తదితరులు ఉన్నారు.