కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సర్కారు హయాంలో 75 శాతం సబ్సిడీపై గొల్ల, కుర్మల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభు త్వం కొనసాగిస్తుందా ? లేదా ? అనేది సందేహంగా మారింది. గొర్రెల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఈ పథకం కొనసాగకపోవడంపై జీవాల పెంపకంపై ఆధారపడి జీవించే గొల్ల, కుర్మలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల కుల వృత్తులకు జీవం పోసిన గత కేసీఆర్ సర్కార్ గొల్ల, కుర్మల సంక్షేమానికి గొర్రెల పంపిణీ పథకాన్ని తీసుకువచ్చింది. అన్ని జిల్లాల్లో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవించే గొల్ల, కుర్మలు ఎంత మంది ఉన్నారనే దానిపై సర్వేలు నిర్వహించింది.
2017లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 4,404 మంది అర్హులను గుర్తించింది. మొదటి విడుతలో 2891 మంది గొర్రెల యూనిట్లని పంపిణీ చేసింది. ఆ తర్వాత రెండో విడుతలో మిగతా లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కరోనా తదితర కారణాలతో గొర్రెల పంపిణీలో జాప్యం జరిగింది. ఇప్పటికీ 1513 మందికి గొర్రెల యూనిట్లు అందలేదు.
ఈ పథకం విలువ రూ.1.75 లక్షలు ఉండగా లబ్ధిదారులు రూ.43,750 డీడీ రూపంలో చెల్లిస్తే మిగతా రూ.1,31250ను ప్రభుత్వం సబ్సిడీని కలిపి గొర్రెలను అందించాల్సి ఉంది. ఒక యూనిట్లో 21 గొర్రెలు కాగా వీటిలో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది. రెండో విడుత గొర్రెలు వస్తాయని భావించిన లబ్ధిదారులు తమ వాటా కింద జిల్లాలో 562 మంది లబ్ధిదారులు రూ.43750 చొప్పున డీడీలు కట్టారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా 230 మందికి గొర్రెలను అందించింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో మిగతా వారికి గొర్రెల పంపిణీలో జాప్యం జరిగింది.
జిల్లాలో గొర్రెల పంపిణీ పథకానికి రెండో విడుతలో 332 మంది లబ్ధిదారులు డీడీలు కట్టి ఎదురుచూస్తున్నారు. మరో 951 మంది లబ్ధిదారులు ఇంకా డీడీలు కట్టలేదు. రెండో విడుతలో కాంగ్రెస్ సర్కారు గొర్రెలు పంపిణీ చేస్తుందో లేదోనని డీడీలు కట్టేందుకు వెనుకాడుతున్నారు. ఇప్పటికే డీడీలు కట్టిన 332 మందికి ఇంకా గొర్రెలు పంపిణీ చేయలేదు. గొర్రెలు ఇవ్వకపోతే కనీసం డీడీలు కట్టిన డబ్బులైనా తిరిగి ఇస్తారో లేదోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ పేద గొల్ల కుర్మల కోసం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని గొల్ల, కుర్మలు, లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.