ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. తిరుపల్లి, వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట గల గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతున్నది. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకొని ఓటీపీ వచ్చిన తర్వాత ఏజెన్సీల వద్దకు వస్తే సిలిండర్లు లేవని అంటున్నారు. రెండు, మూడు రోజులుగా తిరుగుతున్నా గ్యాస్ బుడ్డీలు దొరకడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారులు గ్యాస్ కొరత లేదని అంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వంటగ్యాస్ దొరుకక పోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
భైంసా, మార్చి 24 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కృపా గ్యాస్ ఏజెన్సీ ఎదుట మంగళవారం వేకువ జాము నుంచి ముథోల్, బాసర, భైంసా, కుంటాల, లోకేశ్వరం, కుభీర్ మండలాలకు చెందిన వినియోగదారులు బారులుదీరారు. దాదాపు 600 మందికిపైగా వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకొని ఏజెన్సీ వద్దకు వచ్చారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్లు అందించారు. గ్యాస్‌బుక్ చేసిన తర్వాత 25 రోజుల వరకు మరోసారి బుక్ చేసుకొనే అవకాశం లేకపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొన్నది. అధికారులు దృష్టి సారించి గ్యాస్‌ను సక్రమంగా అందించాలని పలువురు కోరుతున్నారు.
దస్తురాబాద్, మార్చి 24 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి వినియోగదారులు గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చారు. ఖానాపూర్ నుంచి సిలిండర్ల లోడ్ వస్తుందని ఖాళీ సిలిండర్లతో ప్రధాన వీధులు, రహదారుల వెంట వేచి చూశారు. మధ్యాహ్నం ఒంటి గంట అయినా లోడ్ రాకపోవడంతో ఇంటికి వెనుదిగారు. బుక్ చేసిన సిలిండర్లు కూడా ఇవ్వడం లేదని, ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. మండలంలోని దేవునిగూడెం గ్రామానికి ఆటో లోడ్ వచ్చిన విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల వినియోగదారులు పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఎగబడ్డారు. 20 మందికి గ్యాస్ ఇవ్వగా.. మిగతా వారికి దొరుకలేదు.