మంచిర్యాల, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి ) : ఈకేవైసీ(ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) కోసం గ్యాస్ వినియోగదారులు హైరానా పడుతున్నారు. నేటి (ఆదివారం)తో గడువు ముగుస్తున్నదనే ప్రచారంతో ఏజెన్సీల ఎదుట బారులుదీరుతున్నారు. ఉదయమే వృద్ధులు, పిల్లాపాపలతో మహిళలు పల్లెల నుంచి తరలివచ్చి నిరీక్షిస్తున్నారు. ఐదు నిమిషాల పనే అయినప్పటికీ వచ్చే వారి సంఖ్య వందల్లో ఉండడం, రోజు 700 నుంచి 1000 వరకు ఈకేవైసీ చేయాల్సి వస్తుండడం, సర్వర్ డౌన్ వల్ల ఆలస్యం అవుతున్నదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో వినియోగదారులు గంటల తరబడి బారులుదీరుతున్నారు. కొన్ని ఏజెన్సీల వద్ద మరుగుదొడ్లు, తాగునీరు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు.
నిర్మల్ చైన్‌గేట్, డిసెంబర్,30: మాది నిర్మల్ మండలం మేడిపల్లి గ్రామం. గ్యాస్ కనెక్షన్‌కు ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలని అనడంతో నిర్మల్ పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీకి మూడ్రోజులుగా వస్తున్న. ఇంతవరకు పని కాలేదు. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఇక్కడే ఉంటున్న. జనం ఎక్కువగా ఉండడంతో వేచి చూడాల్సి వస్తున్నది. మేడిపల్లి నుంచి నిత్యం ఆటోలో వస్తున్న. పొద్దంతా లైన్లో ఉన్నా పని అయితలే. టోకెన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందవుతున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాల్సి వస్తున్నది. రోజుకు రూ. వంద ఖర్చవుతున్నది. హోటల్లో తినాల్సి వస్తోంది. గిట్ల ఒకేసారి ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు మంచిది కాదు.
-రాజమణి, మేడిపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.500ల సిలిండర్‌కు, ఈకేవైసీకి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే వర్తిస్తున్నది. ఇందుకు డిసెంబర్ 31వ తేదీ డెడ్‌లైన్ పెట్టింది. దీపం, సీఎస్ఆర్, వ్యక్తిగత కనెక్షన్ల వినియోగదారులు ఎప్పుడు వెళ్లినా ఏజెన్సీల్లో ఈకేవైసీ చేస్తారు. కానీ.. అధికారులు చెప్పినా జనం పట్టించుకోవడం లేదు. నేటితో ఉజ్వల పథకానికి ఈకేవైసీ గడువు ముగియనుండడంతో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీల వద్ద క్యూలైన్లు కనిపించాయి. అసత్య ప్రచారం నమ్మి, తొందర పడి ఎవ్వరూ ఏజెన్సీలకు రావొద్దని అధికారులు, నిర్వాహకులు సూచిస్తున్నారు.
మాది మామడ మండలం కిషన్‌రావు పేట గ్రామం. వ్యవసాయ కూలీగా పని చేస్తున్న. నిర్మల్‌లో గ్యాస్ కనెక్షన్ ఉంది. గిప్పుడు ఈకేవైసీ చేయాలనే నిబంధన పెట్టడంతో రెండు రోజుల నుంచి తిరుగుతున్నా పని కాలేదు. అటు కూలి పనికి కూడా పోతలేను. రోజూ రూ. 60 ఆటో ఖర్చే అవుతున్నది. చలికాలం కావడంతో ఉదయమే ఊరి నుంచి రావడానికి ఇబ్బందవుతున్నది. గ్యాస్ సెంటర్ వద్దే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూడాల్సి వస్తున్నది. జనం ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నయ్. హోటల్లోనే తినాల్సి వస్తున్నది. గీ నిబంధన ఎందుకు పెట్టిన్రో అర్థమైతలేదు. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నం.
-లలితా రాథోడ్, కిషన్రావుపేట
ఆదిలాబాద్ పట్టణంలోని ఆధార్ కేంద్రాల్లో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు తీసుకోవడం లేదని నిర్వాహకులు బోర్డులు పెడుతున్నారు. ఇంకా.. 50 రోజుల వరకు టోకెన్ల పంపిణీ పూర్తయిందని, తర్వాత వచ్చి తీసుకుని మేము సూచించిన రోజు వచ్చి అప్డేట్ చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఫిల్టర్‌బెడ్ ఉన్న ఆధార్ కేంద్రంలో ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత టోకెన్లు ఇస్తామని సూచించారు. దీంతో దరఖాస్తుదారులు చేసేది లేక నిరాశతో వెనుదిరిగి పోతున్నారు.
మా వీధిలో అందరూ ఈకేవైసీ చేయించుకుం టున్నరు. ఇవాళ లాస్ట్ రోజు అన్నరు. అందుకే పని వదులుకుని మరీ వచ్చిన. ఇక్కడికి వచ్చినంక నాకు ఇంకా టైమ్ ఉందని చెప్తున్నరు. మాది ఉజ్వల కనెక్షన్ కాదు. అందుకని ఎప్పుడు వచ్చినా చేస్తరంట. పని వదులుకుని వచ్చినందుకు బాధగా ఉంది. మా గల్లీలో ఈకేవైసీ టాకే నడుస్తున్నది. రూ.500 సిలిండర్ రావాలంటే వెంటనే చేయించాలని చర్చించుకుంటున్నరు. అంతా అబద్ధమని ఇక్కడికి వచ్చినంక తెలిసింది.
– మల్యాల నర్సయ్య, గ్యాస్ వినియోగదారుడు, మంచిర్యాల.