మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల (Manchiryala) జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి ముఠాను (Ganja Gang) పోలీసులు గుట్టు రట్టు చేసి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ( CP Srinivas ) తెలిపారు. గురువారం రామగుండం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
పట్టణంలోని ఐబీ చౌరస్తా ఏరియాలో ఉన్న మంచిర్యాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంప్లెక్స్ సెల్లార్లో సోమ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కి సంబంధించిన వై ఇన్ఫో సోల్యూషన్స్ ( Why INFO Soluation ) సీసీ కెమెరాల షాపునకు సంబంధించిన గోదాం ఉంది. అయితే గోదాంలో గంజాయి నిలువ ఉందనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించి, పరిసరాలను తనిఖీ చేయగా కాటన్ బాక్స్ లలో ప్యాక్ చేసి ఉన్న గంజాయిని గుర్తించినట్లు వెల్లడించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని మంచిర్యాల పోలీస్ స్టేషన్ తరలించి వారిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
పట్టుబడిన నిందితుల్లో మంచిర్యాలకు చెందిన ఇరుగురాళ్ల సతీష్ కుమార్, మహ్మద్ సమీర్, భీమ అనుదీప్, మొహమ్మద్ అబ్దుల్ ఉబేద్, అర్జున్ బాబురావు హాన్, మహ్మద్ అజీజ్, జాడి రాఘవేంద్ర స్వామి, గూడూరు రాము, ఎస్కే అథాహుర్, ఎస్కే సమీర్, మరో మైనర్ బాలుడు ఉన్నారని, మరో పదకొండు మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
పట్టుబడిన 23.5 కిలోల గంజాయి విలువ రూ.11.75 లక్షలు ఉంటుందన్నారు. ఈ ముఠా ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మంచిర్యాల టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బందిని సీపీ అబినందించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర, మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లరెడ్డి, సీఐ ప్రమోద్ రావు, టాస్క్ఫోర్స్ సీఐలు రాజ్ కుమార్, రమేష్, ఎస్సైలు లచ్చన్న, ఉపేందర్, కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.