కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో జోరుగా అక్రమ దందా సాగుతున్నది. కొందరు వ్యాపారులు మహారాష్ట్ర నుంచి చెక్‌పోస్టులను దాటుకొని పశువులు, దేశీదారు, గంజా యి, గుట్కావంటివి యథేచ్ఛగా సరఫరా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తున్నది. వాంకిడి సరిహద్దులోని చెక్‌పోస్టును దాటుకొని నిషేధిత పదార్థాలు తీసుకొచ్చే వాహనాలు జిల్లాలోకి ఎలా ప్రవేశిస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారుతున్నది. అయితే, చెక్‌పోస్టు సిబ్బందే కాసుల కోసం కక్కుర్తి పడి వాహనాలను తనిఖీ చేయకుండానే వదిలేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, ఇటీవల జరిగిన పలు ఘటనలను చూస్తే ఆ ఆరోపణలకు బలం చేకూరుతున్నది. ఇటీవల పోలీసులు నిఘా గుట్కా, దేశీదారు. గంజా యి, పశువులను పట్టుకొని పలువురిపై కేసులు నమోదు చేశారు.
జూలై 19న : జైనూర్ మండలం జంగాంకు చెందిన హూర్ మహదేవ్ అనే వ్యాపారీకి చెందిన గోదాంలో రూ.29,120 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి యథేచ్చగా సరఫరా అవుతున్న గుట్కా ప్యాకెట్లను మారుమూల పల్లెలకు తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
జూలై 20న : కాగజ్‌నగర్‌లోని గాంధీనగర్ బస్తీలో పోలీసులు తనిఖీలు చేపట్టి రూ. 95 వేల విలువగల దేశీదారు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి కారులో తీసుకొస్తున్న 1590 (90 ఎంఎల్) దేశీదారు మద్యం బాటిళ్లను పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
జూలై 21న : జైనూర్ మండల కేంద్రంలోని కాలేజీగూడ దగ్గర చేపట్టిన వాహనాల తనిఖీల్లో జైనూర్ నుంచి ఆసిఫాబాద్ వెళ్తున్న కారును తనిఖీచేయగా అందులో 1.5 కిలోల గంజాయి పట్టుబడింది. కారు డ్రైవర్ మొహ్మద్ గులాబ్‌ను విచారించగా, జైనూర్లోని అబ్బాస్ వద్ద కొనుగోలు చేసి కెరమెరిలో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిసింది. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 37 వేలు ఉంటుందని అధికారులు గుర్తించారు. గులాబ్‌పై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
జూలై 24న : కాగజ్‌నగర్ మండలం ఈజ్గాం పోలీస్టేషన్ పరిధిలోని విలేజ్ నంబర్-8లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. దిలీప్‌కుమార్ మండల్ ఇంట్లో తనిఖీలు చేయగా, రూ. 6 వేల విలువ చేసే 200 గ్రాముల గంజాయి దొరికింది. నిందితుడిని విచారించగా మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చినట్లు చెప్పాడు.
జూలై 26న : కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో పశువులను అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 15 ఎద్దులు, 8 గేదెలను అదుపులోకి తీసుకొని నలుగురిపై కేసు నమోదు చేశారు.
గట్టి నిఘా పెట్టాం..
జిల్లాలో అక్రమ రవాణాకు పాల్పడితే ఊరుకునేది లేదు. గట్టి నిఘా పెట్టాం. నిరంతరం తనిఖీలు చేపడుతున్నాం. గుట్కా, దేశీదారు, గంజాయివంటి నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాం. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలి.
– డీవీ శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ