భైంసా, సెప్టెంబర్ 25 : వినాయక నిమజ్జనోత్సవాన్ని మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమయ్యారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బస్టాండ్, పంజేషాచౌక్, నిర్మల్ చౌరస్తా, మార్కెట్ ఏరియా, కుభీర్ చౌరస్తాతోపాటు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు సుమారు 200లు ఏర్పాటు చేశారు.
వీటితో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తూ సమీక్షిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల్లోని విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లతో ప్రమాదం లేకుండా ప్రత్యేక జాగ్రత్త చర్యలు పాటించాలని ట్రాన్స్‌కో సిబ్బందికి అధికారులు సూచించారు. పట్టణంతోపాటు గ్రామాల్లోని బెల్టు షాపులు, మద్యం దుకాణాలను సోమవారం సాయంత్రం నుంచి మూసి వేయించారు. మంగళవారం కూడా బంద్ చేయాలని ఆదేశించారు.
ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ భద్రత కల్పిస్తున్నారు. అదనపు ఎస్పీలు ముగ్గురు, డీఎస్పీలు నలుగురు, సీఐలు 15, ఎస్ఐలు 45, అదనపు పోలీసు సిబ్బంది 557 బందోబస్తులో పాల్గొననున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భైంసా పట్టణంలో ఎక్కడా సమస్య తలెత్తినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కాగా.. ఇప్పటికే పట్టణంలో శాంతి సమావేశం, ఉత్సవ కమిటీ గణేశ్ మండలీలు యువజన సంఘాల సభ్యులతో ఎస్పీ, ఏఎస్పీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని, నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
నిమజ్జనోత్సవం సందర్భంగా మండపాల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా.. సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రోడ్లపై గుంతలను పూడ్చారు. అధికారులు గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేక భారీకేడ్లను కట్టారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు క్రేన్లు అందుబాటులో ఉంచారు. గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.
భైంసా పట్టణంలో నాటి నుంచి నేటి వరకు ఒకే మార్గం గుండా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. భట్టిగల్లిలోని మున్నురుకాపు సంఘం, గోపాలకృష్ణ మందిరంలోని గణేశ్ వద్ద ప్రతిష్ఠించిన వినాయకుల వద్ద ఎస్పీ, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులతోపాటు పలువురు ప్రముఖులు పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించనున్నారు. ఈ శోభాయాత్ర గణేశ్‌నగర్ మీదుగా కోర్బగల్లి, పంజేషాచౌక్, కిసాన్ గల్లి, పురాణా బజార్ మీదుగా ప్రాజెక్టు వరకు సాగుతోంది. కాలనీ, పులేనగర్, రాజీవ్‌నగర్ తదితర కాలనీల్లో బస్టాండ్ మీదుగా మార్కెట్ ఏరియా కలిపి ప్రాజెక్టు మీదికి చేరుకుంటాయి.