మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు సోమవారం గంగమ్మ ఒడికి చేరారు. డప్పు చప్పుళ్ల హోరు.. యువతీ యువకుల నృత్యాలు, కోలాటాలు, పిల్లల కేరింతల నడుమ శోభాయాత్రలు కనుల పండువగా సాగాయి.
‘జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. గణపతి బొప్పా’ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. మహిళలు మంగళహారతులతో తరలివచ్చి లంబోదరుడికి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి, వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేసి.. వెళ్లిరా గణపయ్య అంటూ వీడ్కోలు పలికారు.
పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద ఏర్పాట్లను సీపీ శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు. ఆయన వెంట లక్షెట్టిపేట సీఐ నరేందర్, ఎస్ఐలు ఉన్నారు.