మంచిర్యాల, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రివర్గ విస్తరణ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో గందరగోళానికి తెరలేపింది. ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నాయకుడు ప్రేమ్‌సాగర్‌రావును కాదని, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై పీఎస్సార్ వర్గం భగ్గుమంటున్నది. వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాలో హస్తం పార్టీ కేడర్ రెండు వర్గాలుగా చీలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. నిన్న మొన్నటి వరకూ అంతర్గతంగా సాగిన వివాదాలు ఇకపై ఎటుపోయి ఎటు తిరుగుతాయోనన్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్‌కు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, సీనియర్ నాయకులు సైతం పీఎస్సార్‌కు పదవి పక్కా అనే చెప్పుకొచ్చారు. అధిష్ఠానం ముందు సైతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆయననే రెఫర్ చేస్తూ వచ్చినట్లు తెలిసింది. కానీ, చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామి అనుహ్యంగా రేసులోకి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సపోర్టు దొరకడంతో మంత్రి పదవి కోసం పట్టుబిగించారు. ఇలా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. తాజాగా.. మంత్రివర్గ విస్తరణలో అధిష్ఠానం చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వైపునకు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది. పీఎస్సార్ వర్గం నాయకులు అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పదవి దక్కకపోవడంపై మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అలకబూనిన ఆయన రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం దూరంగా ఉన్నారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హైదరాబాద్‌లోని పీఎస్సార్ నివాసానికి వెళ్లారు. “కష్టకాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని, కార్యకర్తలను కాపాడుకున్నా. పార్టీ పరంగా నాకు అన్యాయం జరిగింది. అన్ని పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చి కేడర్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి పీసీసీ హోదాలో ఉన్నప్పుడు ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా బహిరంగ సభ నిర్వహించి సక్సెస్ చేశాను. భట్టి విక్రమార్క పాదయాత్రను సక్సెక్ చేసి, లక్ష మందితో మంచిర్యాల సభను నిర్వహించాను. నాలా సిన్సియర్‌గా పని చేసిన నాయకుడికి న్యాయం చేస్తే కార్యకర్తలకు అది ఇన్పిరేషన్‌గా ఉండేది. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. పార్టీ నాకు తీవ్ర అన్యాయం చేసింది’ అంటూ పార్టీ పెద్దల ముందే ఆయన అసంతృప్తి వెల్లగక్కినట్లు సమాచారం. మంత్రి పదవి కాకుండా మరో కీలక పదవి ఆఫర్ చేయగా.. నాకు ఎలాంటి పదవులు వద్దు. కార్యకర్తగానే ఉంటా.. పార్టీని విడిచిపోను” అని ఆయన చెప్పినట్లు తెలిసింది. పీఎస్సార్ సన్నిహితులు మాత్రం అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మా సార్‌కు అన్యాయం చేశారంటూ వాపోతున్నారు. సార్ ఆదేశిస్తే ఏమైనా చేసేందుకు సిద్ధమని స్పష్టం చేస్తున్నారు.
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడం వెనుక సామాజిక సమీకరణలు, కారణాలు ఏమున్నా.. కుటుంబ రాజకీయాలను పార్టీ ప్రోత్సహిస్తుందనే ముద్ర పడిపోయింది. గతంలో ప్రేమ్‌సాగర్‌రావు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. గడ్డం వివేక్, గడ్డం వినోద్లకు ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వారి కుమారుడు వంశీకృష్ణకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు వారి కుటుంబానికే మంత్రి పదవి ఇస్తే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల గొంతుకగా ఉన్న నా గొంతు కోసినట్లే అంటూ చెప్పారు. మొన్నటికి మొన్న గడ్డం వివేక్ అండ్ ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చీలికలు తెస్తున్నారంటూ, ప్రత్యేక వర్గాన్ని రెడీ చేసుకుంటున్నారంటూ పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులే బహిరంగ విమర్శలకు దిగారు. సొంత నియోజకవర్గ నాయకులే మా ఎమ్మెల్యే బీజేపీలోకి పోతాడా.. బీఆర్ఎస్లోకి పోతాడా అనే అనుమానాలున్నాయంటూ మాట్లాడుకొచ్చారు. కానీ ఇవేవీ కాంగ్రెస్ అధిష్ఠానం లెక్కలోకి తీసుకున్నట్లు లేదు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన నాయకుడికి కాదని, పార్టీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తులకు పదవులు ఇవ్వడంపై మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తున్నది. కుటుంబ రాజకీయాలను సహించం, కష్టపడిన వారికే పదవులు ఇస్తామంటూ చెప్పిన నీతి వ్యాఖ్యలను అధిష్ఠానం విస్మరించిదంటూ అసంతృప్తి వెల్లగక్కుతున్నారు.
తాజా మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్‌కు చోట దక్కింది. సామాజికవర్గ సమీకరణలో భాగంగా ఆయనకు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. కాగా, మంత్రివర్గంలో మరో ముగ్గురిని చేర్చుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. అందులో పీఎస్సార్‌కు చోటు ఉంటుందని ఆయన అనుచరులు, కార్యకర్తలు ఇప్పటికీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సైతం ఇదే హామీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. జిల్లాల వారీగా చూసుకుంటే రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి ఇప్పటి వరకు మంత్రి వర్గంలో ఎవరికి చోటు ఇవ్వలేదు. జిల్లా సమీకరణలో మిగిలిన మూడు మంత్రి పదవులను ఇలా భర్తీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ మంత్రిగా ఉన్నందున.. పీఎస్సార్‌కు ఇక మంత్రి పదవి రావడం కష్టమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సామాజికి సమీకరణలు తీసుకున్నా పీఎస్సార్‌కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఒకవేళ ఆయన పట్టుబడితే ఎలాంటి సమీకరణలు చేయకుండా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదు. పీఎస్సార్ ఏం చేయబోతున్నారు.. భవిష్యత్తు కార్యచరణ ఏమైనా ప్రకటిస్తారా.. లేకపోతే మిన్నకుండిపోతారా… ఆయన విషయంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. అన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.