కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని వాంకిడి గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్ జరిగినట్లు తెలుస్తున్నది. తాత్కాలిక వర్కర్ల అకౌంట్లలో పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు జమచేసి.. ఆపై డా చేసుకున్నట్లు సమాచారమున్నది. సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు పక్కదారి పట్టించినట్లు తెలుస్తుండగా, సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది.
తాత్కాలిక వర్కర్ల ఖాతాల్లోకి..
వాంకిడి గ్రామపంచాయతీలో పనిచేసే తాత్కాలిక వర్కర్ మిథున్ పేరున పలుమార్లు నిధులు జమ చేశారు. ట్రాక్టర్ మెయింటనెన్స్ పేరిట ఓసారి రూ. 66 వేలు, శానిటేషన్ పేరిట మరోసారి రూ. 88 వేలు, స్యాండ్ ఫిల్లింగ్ ఎట్ మండోర్, రాంనగర్ అనే పేరిట రూ.లక్ష, శానిటేషన్ మెయింటనెన్స్ పేరి రూ.1.91 లక్షలు.. ఇలా ఇతని పేరుమీదున్న ఖాతాలోకి పలుమార్లు నిధులు వేశారు.
ఇక మరో వర్కర్ వడ్లూరి ప్రభాకర్ ఖాతాలో అంకిని, చిన్న వాంకిడిలలో ఇసుక పనులు చేపట్టినట్లు రూ. లక్ష, గ్రామ పంచాయతీ నిర్వహణ, వర్కర్లకు డ్రెస్‌లు, ట్రాక్టర్ మెయింటనెన్స్వంటి అనేక రకాల బిల్లులు జమచేశారు. ఆపై ఆ నిధులు డ్రా చేసుకున్నారు. మరికొందరి వర్కర్ల పేరిట కూడా అనేక బిల్లులు జమ చేసి పక్కదారి పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా నిధులు జమ
గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్ల అకౌంట్లలో వారి వేతనాలు తప్ప జీపీకి సంబంధించిన ఎలాంటి నిధులు వేయరాదు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఆ పనులు చేసిన వారి పేరుమీద (కాంట్రాక్టర్లు), మెటీరియల్ సరఫరా చేస్తే.. ఆ దుకాణాదారుడి పేరు మీద బిల్లులు ఇవ్వాలి.
కానీ వాంకిడి గ్రామ పంచాయతీలో మాత్రం అభివృద్ధి పనులు, కొనుగోలు చేసిన మెటీరియల్స్, ట్రాక్టర్ మెయింటనెన్స్, రిపేర్స్వంటి.. బిల్లులను తాత్కాలిక వర్కర్ల అకౌంట్లలో వేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సర్పంచుల పదవీ కాలం ముగుస్తుందనే సమయంలో ఈ తతంగం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీలో చాలా వరకు పనులు చేపట్టకుండానే.. చేపట్టినట్లు తాత్కాలిక వర్కర్ల పేరున అకౌంట్లలో నిధులు జమచేసి తర్వాత వాటిని అప్పటి పంచాయతీ పాలకులు లేపుకున్నారనే ఆరోపణలున్నాయి.
పనిలో నుంచి తీసేస్తామంటేనే..
వాంకిడి గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు జమ చేసిన విషయమై ఆయా వర్కర్లు మిథున్, వడ్లూరి ప్రభాకర్‌ను వివరణ కోరగా.. అప్పటి గ్రామ పంచాయతీ పాలకులు చెప్పినట్లు చేయకపోతే పనుల్లో నుంచి తీసేస్తామని బెదిరించారని తెలిపారు. తమ అకౌంట్లలో జమ చేసిన డబ్బులు డ్రా చేసి అప్పటి పాలకులకు ఇచ్చామని వారు తెలిపారు.
అధికారులు ఏమంటున్నారంటే..
వాంకిడి గ్రామ పంచాయతీ నిధులను తాత్కాలిక సిబ్బంది ఖాతాల్లో జమచేసి.. ఆ తర్వాత డ్రా చేసుకున్న విషయంపై డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్‌ను వివరణ కోరగా.. గ్రామ పంచాయతీ సిబ్బంది ఖాతాల్లో ఎలాంటి ఇతర నిధులు జమచేసేందుకు వీలు లేదని, అలా చేస్తే అది నేరమే అవుతుందని తెలిపారు. పత్రికల్లో వార్తలు వచ్చిన తర్వాత విచారణ చేపడుతామన్నారు. ఇక ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ను వివరణ కోరేందుకు సంప్రదించగా సెలవులో ఉన్నట్లు తెలిసింది.