నిర్మల్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : పదేళ్లుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ దేవేందర్‌రెడ్డి.. తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే అనేక మంది పేద రోగులకు ఖరీదైన శస్త్రచికిత్సలను ఉచితంగా చేసి పలువురికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ దేవేందర్‌రెడ్డి, గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా ఓ బాధితుడికి రూ.10 లక్షలకు పైగా విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందజేశారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మీవాడ ప్రాంతానికి చెందిన చొక్కాల శంకర్ నెల రోజుల క్రితం బాత్రూంలో జారిపడగా, కాలి కింది భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే సమీపంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. వారం పది రోజులైనా గాయం మానలేదు. ఇన్ఫెక్షన్ పెరిగిపోతుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా మానకపోవడంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తెలిసిన వారి సూచన మేరకు నిర్మల్‌లోని డాక్టర్ దేవేందర్‌రెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి, అశ్వీర్రెడ్డి, క్రిటికల్‌కేర్ డాక్టర్ శ్రీనివాస్ యాదవ్‌ల బృందం శంకర్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి కాలుకు ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉందని, ప్రాణాలు కాపాడాలంటే కాలును పూర్తిగా తీసేయాల్సి ఉంటుందని బాధితుడి కుటుంబ సభ్యులకు తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు మొదట శస్త్రచికిత్స నిర్వహించి మోకాలు వరకు కాలును తొలిగించారు. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో మరోసారి ఆపరేషన్ నిర్వహించి తుంటిభాగం వరకు తొలిగించారు. ఈ రెండు సర్జరీలు కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన అపోలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కిరణ్ పర్యవేక్షణలో నిర్వహించడంతో విజయవంతంగా కాలును తొలిగించి బాధితుడి ప్రాణాలు కాపాడగలిగారు. ప్రస్తుతం శంకర్ పూర్తిగా కోలుకోవడంతో గురువారం ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేశారు. నయాపైసా తీసుకోకుండా పూర్తి ఉచితంగా రెండు శస్త్ర చికిత్సలను నిర్వహించడమే కాకుండా, 15 రోజులపాటు వైద్య సేవలను ఉచితంగా అందించిన డాక్టర్ దేవేందర్‌రెడ్డికి ఈ సందర్భంగా శంకర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన శంకర్‌కు కార్పొరేటు స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించి ప్రాణాలు కాపాడామన్నారు. ఇందులో ఆయన కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉందన్నారు. తన పుట్టిన రోజైన గురువారమే ఆయనను డిశ్చార్జి చేయడం సంతృప్తిని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.