జైనూర్/పెంచికల్పేట్/జన్నారం/నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 24 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృత్యువాత పడ్డారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనక కాశీరాం (42) సీఆర్టీగా జొడేఘాట్లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విధులు ముగించుకొని స్వగ్రామమైన మార్లవాయికి వచ్చాడు.
కాసేపటికే తీవ్ర అస్వస్థతతో మృతి చెందాడు. పెంచికల్పేట్ మండలం ఎలపల్లి గ్రామానికి చెందిన లోంకర్ ప్రభాకర్ (24) బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దహెగాంలో ఉన్న తన అక ఇంటికి వెళ్లాడు. అక్కడ పొలం పనులు చేస్తుండగా, ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆటోలో దవాఖానకు తరలిస్తుండగా, మార్గంమధ్యలో మృతి చెందాడు.
ఇక మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తొమ్మిదిగుడిసెల పల్లెకు రాసమల్ల భూదేవి(60) బుధవారం కూలీ పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాగా, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గురువారం తెల్లావారు జామున మృతి చెందినట్లు ఆమె కుమారుడు రాసమల్ల స్వామి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురికాలనీకి చెందిన మహ్మద్ బేగ్ కుమారుడైన సోఫిబేగ్ (25) గురువారం వడదెబ్బతో మృతి చెందాడు. సోఫిబేగ్ మూడు నెలల క్రితమే దుబాయ్ నుంచి నిర్మల్‌కు వచ్చాడు.