మందమర్రి, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ డ్రామాలాడుతున్నదని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం మందమర్రి పట్టణంలో ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి సర్కారు పాలనపై స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా అంటూ అడిగి తెలుసుకోగా, సబ్బండ వర్గాల ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ నియోజక వర్గ పరిధిలోని 102 గ్రామ పంచాయతీలతో పాటు మూడు మున్సిపాలిటీల్లో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇది రాష్ట్రవ్యాప్త కార్యక్రమం అయినప్పటికీ చెన్నూర్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టినట్లు చెప్పా రు. ఇంటింటికీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తామని, ఆపై వాటిని ప్రజాప్రతినిధులకు అందజేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 20 నెలల్లో ప్రజలకు ఉపయోగపడేలా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లను అమలు చేయకుండా కమీషన్ల పేరిట కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
హామీలు అమలు చేయడం చేతగాక బీఆర్ఎస్పై బురదజల్లే విధానాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు నాయకత్వాన్ని విమర్శిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజారమేశ్, పట్టణ అధ్యక్షుడు రవీందర్, పట్టణ ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు కొంగల తిరుపతి రెడ్డి, మేడిపల్లి సంపత్, బండారు సూరిబాబు, బోరిగం వెంకటేశ్, భూపెల్లి కనకయ్య, ఎండీ అబ్బాస్, బడికెల సంపత్, మేడపల్లి మల్లేశ్, భట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, మంద వేణుగోపాల్ రెడ్డి, బెల్లం అశోక్, పల్లె నర్సింగ్, ముస్తఫా, కనకం రవీందర్, సాగర్, రమ, లక్ష్మి పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ కోతలే
రామకృష్ణాపూర్, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ కోతలే తప్ప.. వాగ్ధానాలు నెరవేర్చడం చేతకాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌చౌక్ వద్ద ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలనే మంచిగుండేనని ప్రజలు అంటున్నారని తెలిపారు. 14 యేండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్కు అధికారం ఇస్తే సంక్షేమం, అభివృద్ధి చేశామన్నారు.
యావత్ తెలంగాణ మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నదన్నారు. ఫిర్యాదులు స్వీకరించి ఈ నెల 10న కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్‌గౌడ్, నాయకులు రామిడి కుమార్, నందిపేట సదానందం, వేముల వెంకటేశం, పిల్లి సతీశ్, కలవల సతీశ్, మాజీ కౌన్సిలర్ అనిల్‌రావు, యూత్ నాయకుడు రామిడి లక్ష్మీకాంత్, గోనె రాజేందర్, మహిళా నాయకురాలు పూరెల్లి రాజేశ్వరి పాల్గొన్నారు.
గెలిచి రెండేైళ్లెనా తట్టెడు మట్టి తీయలే
జైపూర్, సెప్టెంబర్ 1 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు సమీపిస్తున్నా.. నియోజకవర్గంలో తట్టెడు మట్టితీసింది లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం జైపూర్ మండలకేంద్రంలో ‘అప్పుడే మంచిగుండే ’ కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలిసి ప్రారంభించారు. పలు గ్రామాలనుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు జై కేసీఆర్, జై కేటీఆర్, జై బాల్క సుమన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ ప్రజల అభిప్రాయాలను సేకరించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి.. పూర్వవైభవం తీసుకురావాలన్నారు. 40 వేల ఉద్యోగాలు ఇస్తామన్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కనీసం నాలుగు ఉద్యోగాలు పెట్టించిందిలేదన్నారు. కానీ వారింట్లో మాత్రం మూడు ఉద్యోగాలు సంపాదించినట్లు తెలిపారు. తాము చేపట్టిన పనులకే శంకుస్థాపనలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బల్మూరి అరవిందరావు, సీనియర్ నాయకులు రిక్కుల మధూకర్‌రెడ్డి, ఆర్నె సమ్మయ్య, మేడి తిరుపతి, బడుగు రవి, పెద్దపల్లి రమేశ్, నామాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలంగాణలో పాలన గాడితప్పింది
భీమారం, సెప్టెంబర్ 1 : తెలంగాణలో పాలన గాడితప్పిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. భీమారం మండలకేంద్రంలో ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని, రైతులకు యూరియా దొరకడం లేదని మండిపడ్డారు. అనంతరం సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రంమలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ పాల్గొన్నారు.
ముంపునకు గురైన పంటలు పరిశీలించిన బాల్క సుమన్
జైపూర్, సెప్టెంబర్ 1: ఇటీవల కురిసిన వర్షాలకు జైపూర్ మండలంలోని వేలాల, కిష్టాపూర్, పౌనూర్ గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పరిశీలించారు. ఇన్ని రోజులు కాళేశ్వరం వల్లే వరదలు వచ్చాయని గ్లోబెల్ ప్రచారాన్ని నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ఏమని సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.