కడెం, మే 27: పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయడానికి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన తాజీ మాజీ సర్పంచులను కడెం (Kadam) పోలీసులు అరెస్టు చేశారు. కడెం మండలంలోని పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచుల ఇళ్లలోకి ఉదయాన్నే వెళ్లి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నదని, ఇళ్లలో నుంచి సర్పంచులను అరెస్టు చేసి తీసుకురావడం ఏంటని మండిపడ్డారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడుగుతుంటే కనీసం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న తమకు బిల్లులు ఇచ్చి ఊరటనివ్వల్సింది పోయి ఇలా అక్రమ అరెస్ట్ చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు.
చేసిన పనులకు బిల్లులు ఇవ్వమని అడిగితే, తమను ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా అక్రమ అరెస్టులు చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారా అని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను అడుక్కునే పరిస్థితి కూడా లేదా అని అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా తాము బయపడేది లేదని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులతో కలిసి సీఎం ఇల్లును ముట్టడిస్తామని చెప్పారు. తమ బిల్లులను పూర్తిగా చెల్లించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఓట్లు అడుక్కునే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో మాసాయిపేట, దిల్దార్‌నగర్, చిన్నబెల్లాల్, అంబారిపేట, పాండ్వాపూర్ సర్పంచులు మెలుగూరి రాముగౌడ్, బద్దనపెల్లి విజయ-స్టీఫెన్, శ్రీకాంత్‌యాదవ్, కొప్పుల లక్ష్మీ-లచ్చన్న, పిన్నం మల్లవ్వ-మల్లేశ్, తదితరులు ఉన్నారు.