మంచిర్యాలటౌన్, నవంబర్ 14 : పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదన్న కారణంతోనే వ్యాపారులపై కక్షగట్టి మార్కెట్‌రోడ్‌లోని భవనాలను ఇష్టారాజ్యంగా కూల్చివేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని మార్కెట్రోడ్లో ఆయన పర్యటించారు. వ్యాపారులకు సంబంధించిన కూల్చి వేతలను, ఇష్టారీతిన తవ్విన కందకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాలలో వ్యాపారులు, ప్రజలు భయంతో జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. ఎలాంటి టెండర్లు లేకుండానే అర్చన టెక్స్ చౌరస్తా నుంచి కిందకు రోడ్డు వెడల్పు పేరుతో భవనాలను కూల్చేశారని, కాలువ నిర్మాణం కోసం కందకం తవ్వారని తెలిపారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతోనే అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి చేస్తే స్వాగతిస్తామని, కానీ కక్షపూరితంగా చేస్తున్న పనులను ఏమాత్రం సహించబోమని అన్నారు. వ్యాపారులు, ప్రజలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంచిర్యాలలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, నాయకులు ఎడ్ల శంకర్, పడాల రవీందర్, శ్రీనివాస్, కర్రు శంకర్, రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు.