మంచిర్యాలటౌన్, మే 31: కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ మంచిర్యాల జిల్లాకు తలమానికంగా నిలుస్తుందని, గతంలో 330 పడకల సామర్థ్యమే ఉండేదని, ప్రస్తుతం 450 పడకల సామర్థ్యంతో మెడికల్ కళాశాల, హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని మాజీ ఎమ్మె ల్యే దివాకర్‌రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని కాలేజీరోడ్‌లో పాత మా ర్కెట్‌యార్డు ఆవరణలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం దాని సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ సర్కారులో మంచిర్యాలకు మెడికల్ కాలేజీ మంజూరైందన్నారు. కాలేజీ ఎక్కడ నిర్మించాలన్న విషయం లో చాలా ఇబ్బందులు పడ్డామని, కానీ మెడికల్ కాలేజీ, హాస్టల్లను గుడిపేటలో, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే హాస్పిటల్‌ను మార్కెట్‌యార్డు స్థలంలో నిర్మించాలని నిర్ణయించామన్నారు. వేర్వేరు చోట్ల కట్టడం కుదరదని అధికారులు చెప్పినా పట్టుబట్టి ఇక్కడే ఉండాలని ఒప్పించినట్లు తెలిపారు. ఇక్కడ ఉన్న 10 ఎకరాల్లో హాస్పిటల్ కోసం మూడెకరాలు వాడుకుంటున్నారని, ఇంకా మిగిలిన భూమిలో ఎంసీహెచ్నుగాని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గాని నిర్మించుకోవచ్చన్నారు.
అదీగాక ప్రస్తుతం ఉన్న ఏరియా హాస్పిటల్ 55 ఏళ్ల క్రితం కట్టిందని, దానిని తొలగించి ఆ స్థానంలో కూడా ఆస్పత్రులను నిర్మించవచ్చునని అన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాదికల్లా కొత్త భవనాల్లో కాలేజీ, హాస్టల్, హాస్పిటల్ ప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించి మెడికల్ కాలేజీని మంజూరు చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గాదెసత్యం, అక్కూరి సు బ్బయ్య, అంకం నరేశ్, సుంకరి రమేశ్, తోట తిరుపతి, ఎర్రం తిరుపతి, సాగి వెంకటేశ్వర్రావు, శ్రీపతివాసు, తాజుద్దీన్ పాల్గొన్నారు.