లక్షెట్టిపేట, ఫిబ్రవరి 11 : ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఒక్కో కార్యకర్త వంద మందితో సమానమని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని కే.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నడిపెల్లి విజిత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, అంకతి గంగాధర్, మైనార్టీ నాయకులు చాంద్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ వైస్ ఎంపీపీలు, మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులుక కార్యకర్తలు పాల్గొన్నారు.