కోటపల్లి/చెన్నూర్ రూరల్/హాజీపూర్/దండేపల్లి/లక్షెట్టిపేట/జైపూర్, సెప్టెంబర్ 15 : యూరియా కోసం రైతన్నలు ఆగ్రహంతో ఊగిపోయారు. సోమ వారం పలుచోట్ల రాస్తారోకోలు.. ధర్నాలు నిర్వహించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పనులన్నీ వదులుకొని పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని కోటపల్లి-చెన్నూర్ ప్రధాన రహదారిపై కర్షకులు ధర్నా నిర్వహించారు.
చుట్టు పక్క గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు రెండు గంటలకు పైగా రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరిపడా యూరియా అందించడంలో పూర్తిగా విఫమమైందని మండిపడ్డారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే స్థానిక మంత్రి, ఎంపీ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో కోటపల్లి ఎస్ఐ రాజేందర్, చెన్నూర్ ఎస్ఐ శ్యామ్ పటేల్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు.
యూరియా పంపిణీ చేస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు భీష్మించుకుకూర్చున్నారు. ఎస్ఐ రాజేందర్ సుమారు గంటకు పైగా చర్చలు జరుపగా, రైతులు శాంతించారు. ఆపై కోటపల్లి ఏఈవో రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు టోకెన్లు అందజేశారు. చెన్నూర్ మండలం కిష్టంపేట రైతు వేదిక వద్ద సరిపడా యూరియా అందజేయాలని రైతులు మంచిర్యాల-చెన్నూర్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. నారాయణపూర్, కత్తెరశాల, రాగిపేట గ్రామపంచాయతీలకు వచ్చిన 266 బస్తాలు పంపిణీ చేసేందుకు అధికారులు కిష్టంపేట రైతు వేదిక వద్దకు వచ్చారు.
సుమారు 1000 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. ఇంత మంది రైతులుంటే కేవలం 266 బస్తాలు ఎలా సరిపోతాయంటూ సిబ్బందిపై మండిపడ్డారు. సీఐ దేవేందర్ రావు, ఎస్ఐ సుబ్బారావు రైతులకు నచ్చచెప్పి పోలీసు బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు. ఏడీఏ బానోత్ ప్రసాద్, ఏవో యామిని, ఏఈవో సాయికృష్ణ, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నూర్ పట్టణంలోనిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. వారం నుంచి చెన్నూర్‌లోని సొసైటీ వద్ద యూరియా పంపిణీ చేయడం లేదంటూ మండిపడ్డారు. 600 నుంచి 1000 మంది రైతులున్న గ్రామాలకు 222 బస్తాలు కేటాయిస్తున్నారని, అవి ఎలా సరిపోతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు, ఎస్ఐ సుబ్బారావు రైతులకు నచ్చచెప్పడంతో ధర్నా విరమించారు. హాజీపూర్ మండలం పడ్తన్‌పల్లి పీఏసీఎస్‌లో పోలీసుల పహారా నడుమ యూరియా బస్తాలు పంపిణీ చేశారు. ఆదివారం సాయంత్రం గడిపేట రైతు వేదికకు 532 బస్తాలు వచ్చాయి. ఉదయం 5 గంటల నుంచే రైతులు పెద్ద సంఖ్యలో రైతు వేదికకు చేరుకొని క్యూకట్టారు.
ఎస్ఐ స్వరూప్‌రాజ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పా టు చేశారు. ఒక్కో రైతుకు బస్తా చొప్పున పంపిణీ చేశారు. దండేపల్లి మండల కేంద్రంలోని నెల్కివెంకటాపూర్ పీఏసీఎస్ గోదాంతో పాటు, గూడెం సొసైటీ గోదాం, ముత్యంపేట, లింగాపూర్, ద్వారక రైతు వేదికల వద్ద సోమవారం రైతులకు యూరియా అందజేశారు. రెండెకరాలకో యూ రియా బస్తా చొప్పున అందజేశారు. జైపూర్ మండలంలోని ఇందారం రైతు వేదిక వద్ద ఇందారం, రామరావుపేట, టేకుమట్ల, ఎల్కంటి గ్రామాలకు సంబంధించి 330 బస్తాలు రాగా, రైతులు క్యూ కట్టారు. టోకెన్లు ఇచ్చి.. రైతులకు బస్తాలు అందజేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/దహెగాం/రెబ్బెన/తిర్యాణి, సెప్టెంబర్ 15 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతుల రద్దీ కనిపించింది. దహెగాం మండలం గిరివెళ్లికి వెళ్తున్న యూరియా లారీని చిన్నరాస్పల్లి వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. యూరియా లారీ వెళ్తున్న విషయాన్ని తెలుసుకున్న రైతు లు ఒక్కసారిగా రోడ్డు మీదికి వచ్చి రాస్తారోకో చేశారు. గిరివెల్లికి వెళ్లిన తర్వాత తమకు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని, ఇక్కడే యూరియా ఇవ్వాలంటూ రైతు లు పట్టుబట్టారు.
ఏవో రామకృష్ణ, కాగజ్‌నర్ రూరల్ సీఐ కుమారస్వామి,అక్కడికి చేరుకొని టోకెన్లు ఇచ్చారు. గిరివెల్లి రైతు వేదిక వద్దకు వెళ్లి బస్తాలు తెచ్చుకోవాలని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇక దహె గాం, గిరివెల్లి పీఏసీఎస్ కేంద్రాల వద్ద రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. దహెగాంలో 888 బస్తాలు, గిరవెల్లిలో 888 బస్తాలు పంపిణీ చేశారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని సహకార సంఘంలో రైతులు యూరియా కోసం ఉదయం 9 గంటల నుంచే బారులు తీరారు. 1350 యూరియా బస్తాలను 550 మంది రైతులకు పంపిణీ చేసినట్లు ఏవో నాగరాజు తెలిపారు.
మరికొంత మంది బస్తాలు దొరకక నిరాశతో వెనుదిరిగారు. ఎస్ఐ సర్తాజ్ పాషా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవోలు మారుతి, శ్రీధర్, మీన పాల్గొన్నారు. తిర్యాణి పీఏసీఎస్ కేంద్రం వద్ద చెప్పుల వరుస పెట్టారు. కాగజ్‌నగర్ మండలం జంబుగాలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం ఉదయం నుంచే రైతులు భారీ స్థాయిలో బారులు తీరారు. రెబ్బెన మండలానికి 5 లారీల లోడ్ (2220) రాగా, సోమవారం ఉదయం నుంచే అన్నదాతలు స్థానిక రైతు వేదిక వద్ద బారలు తీరారు.
ఆపై పట్టా పాస్ పుస్తకం జిరాక్సులు క్యూలో ఉంచారు. టోకెన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఎస్ఐ వెంకటకృష్ణ రైతులతో మాట్లాడి అందరికీ యూరియా బస్తాలు పంపిణీ చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సుమరు 300 మందికి పైగా రైతులకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తామని ఏవో దిలీప్ తెలిపారు. తిర్యాణిలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట చెప్పుల వరుస పెట్టారు. పోలీసు పహారా నడుమ 440 బస్తాలు పంపిణీ చేశారు.
ప్రభుత్వాల వైఫల్యమే..
మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. సోమవారం లక్షెట్టిపేటలోని అంబేదర్ చౌక్ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ యూరియా కోసం ఇబ్బంది పడ్డది లేదన్నారు. గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఐ రమణామూర్తి, ఎస్ఐ సురేశ్ అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ తీసి తహసీల్దార్ దిలీప్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు చుంచు చిన్నన్న, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, నాయకులు షేక్ చాంద్, అంకతి గంగాధర్, రైతులు పాల్గొన్నారు.