రామకృష్ణాపూర్, మే 3: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు 25 మందిపై కుట్రపూరితంగా కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం విదితమే. ఆందులో భాగంగా కోర్టు కండీషన్ బెయిల్ ఇవ్వగా, ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు అనేక సమస్యలు తన దృష్టికి తేవడం జరిగిందన్నారు.
యాసంగి సీజన్ వడ్లు అన్ని కల్లాల్లోకి వచ్చినయని, నియోజకవర్గంలో ఏ ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రంలో కూడా వడ్లు కొంటున్న పరిస్థితి కనబడుట లేదన్నారు. ముఖ్యంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వడ్లు కొనడం కనబడటంలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 2022-23 యాసంగి సీజన్లో నియోజకవర్గానికి సంబంధించి 107 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 80,528 మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయని అంచనాకు వచ్చి 67,603 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని గుర్తు చేశారు. ఇంకా 732 మెట్రిక్ టన్నుల వడ్లు రావాల్సి ఉండే అని తెలిపారు. 75 వేల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రొక్యూర్ చేయడం జరిగిందన్నారు అట్లా మంచిర్యాల జిల్లాకు సంబంధించి 22,628 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినామని తెలిపారు.
మంచిర్యాల నియోజకవర్గంలో 87, కొనుగోలు కేంద్రాలు, చెన్నూరు నియోజకవర్గంలో 107 కేంద్రాలు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 42 కొనుగోలు కేంద్రాలు, జన్నారం (ఖానాపూర్ నియోజకవర్గం) మండలంలో 26 కొనుగోలు కేంద్రాలు మొత్తం జిల్లాలో 262 కోనుగోలు కేంద్రాల పెట్టి 2,28,668 మెట్రిక్ టున్నల వడ్లు ఆనాడు ప్రోక్యూర్ చేయడం జరిగిందన్నారు. జిల్లా రైతులు పండించిన వడ్లను ఏ కొనుగోలు కేంద్రంలో కొంటలేరని తెలిపారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మొత్తుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే జైపూర్ మండలం జైపూర్‌లో ఆందోళన చేసారని, ఇటీవల కురిసిన వర్షాలకు అంగ్రాజ్ పల్లె,కొమ్మెర, ఎర్రగుంటపల్లి, నాగపూర్, బీరవెల్లి, పొక్కూరు.
గ్రామాల్లో వడ్లు తడిసినయ్ అన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మాట్లాడటం లేదన్నారు. ఆయనకు ప్రజల పనుల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ పనులు ఎక్కువైనయ్ అని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా కలెక్టర్ పనిచేస్తావున్నాడు తప్ప ప్రజలకు పనులు చేస్తలేడని అన్నారు. మంత్రి వివేక్ వడ్ల కొనుగోలును గాలికి వదిలేశారని, తక్షణమే కల్లాలకు వచ్చిన వడ్లను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున రెండు రోజులు వేచిచూస్తామని, తర్వాత రైతులను, నాయకులను తీసుకొని రోడ్ల మీదకు వచ్చి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని మంత్రి వివేక్‌ను హెచ్చరించారు. చెన్నూరు పట్టణంలో ఎలాంటి నోటీసులు లేకుండా రోడ్ల విస్తరణ పేరుతో వ్యాపారస్తుల ఇండ్లును కూల్చి వేస్తున్నారని, హైదారాబాద్‌లో జరుగుతున్న విధ్వంసలా చెన్నూరు పట్టణంలో జరుగుతుందన్నారు.
మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అక్కడి వారితో చర్చలు జరిపి వ్యాపారస్తులను ఒప్పించి నష్టపరిహారం ఇచ్చి రోడ్డు విస్తరణ చేసుకోవాలన్నారు. పోలీసులను పెట్టి వారిని బెదిస్తూ పనులు చేయడం సరికాదన్నారు. చెన్నూరు ఇప్పటికే బైస్పాస్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. దాని వినియోగించుకోవాలని సూచించారు. వ్యాపారులను ఇబ్బందులు పెట్టి ఇండ్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. జైపూర్ పవర్ ప్లాంట్‌లో భూములు కోల్పోయిన పరిసర గ్రామాల యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఎవ్వరికి చెబితే వారికి ఇవ్వడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, నాయకులు రామిడి కుమార్, జే. రవీందర్, మేడిపల్లి సంపత్, అనిల్‌రావు, తదితరులు పాల్గొన్నారు.