ఎదులాపురం, జనవరి 23 : గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఓటమి కాదని, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని, నేటికీ కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలే ప్రజాక్షేత్రంలో ఉన్నాయని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు నూతనోత్సాహంతో గ్రామాలు, పట్టణ కమిటీల సౌజన్యంతో ముందుకెళ్లి ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం దిశగా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్, ఆత్మ చైర్మన్ రమేశ్, పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు సాజిదొద్దీన్, ప్రమోద్‌రెడ్డి, సతీశ్పవర్, రోకండ్ల రమేశ్, బుట్టి శివ, సలీం పాషా, దాసరి రమేశ్, స్వరూపరాణి, బుడగం మమత, పర్వీన్ ఫిరోజ్, దివిటి రాజు, పర్వీన్ సుల్తాన, కరుణ పాల్గొన్నారు.