కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన పులి అటవీ సమీప గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. నిత్యం ఎక్కడోచోట పశువులపై దాడులు చేస్తుండగా, భయం భయంగా గడపాల్సిన పరిస్థితి నెలకొంది. సాధారణంగా యేటా అక్టోబర్ నుంచి జనవరి మాసాల్లో తోడు కోసం జిల్లాలోకి వచ్చే పులులు ప్రాణహిత బార్డర్సమీపంలోనే సంచరించేవి. కానీ.. ఈ యేడాది ఇందుకు భిన్నంగా జిల్లాలోకి ప్రవేశిస్తూ ఏజెన్సీ ప్రాంతంలోని అడవుల్లో తిరగడం విశేషం. దాదాపు నాలుగు నెలలుగా కెరమెరి, జైనూర్, ఊట్నూర్, నార్నూర్ మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి పశువులపై దాడి చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నది. అయితే.. ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ఒక్కటేనా.. లేక అంతకన్న ఎక్కువగా ఉన్నాయా అనేది..
అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. గత ఆగస్టులో కెరమెరి మండల పరిధిలో పులి అడుగులను గుర్తించిన అటవీ అధికారులు.. ఆపై మహారాష్ట్రలోకి వెళ్లిందని భావించారు. కానీ.. రెండు నెలలుగా మళ్లీ పులి సంచారం ఎక్కువైంది. ప్రాణహితను దాటుకొని కాగజ్‌నగర్ మీదుగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపం నుంచి కెరమెరి అడవుల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తున్నది. ఆపై కెరమెరి, తిర్యాణి మండలాల అటవీ పాంతంలో సంచరించి అటు నుంచి కవ్వాల్ అడవుల్లోకి వెళ్లి ఉంటుందని భావించారు. తిరిగి ఇటీవల కెరమెరి అడవుల్లోకి వచ్చినట్లుగా ఆనవాళ్లున్నాయి. వారం క్రితం ఉట్నూర్‌లోని ఎక్స్‌రోడ్, చాందూరి, నార్నూర్, రాజుల్‌గూడ ప్రాంతాల్లో పులి సంచారం కనిపించింది. పశువులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. తాజాగా.. రెండు రోజుల నుంచి కెరమెరి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. జోడేఘాట్ అడవులతో పాటు తిర్యాణి అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు.
కెరమెరి మండలంలో పులి సంచారం ఉండడంతో పోలీసులు, అటవీ అధికారులు డప్పు చాటింపులతో అవగాహన కల్పిస్తున్నారు. మంగళవారం కెరమెరి మండలం టోకెన్ మోవాడ్, బాబెఝరితో పాటు చుట్టుపక్క గ్రామాల్లో పులి సంచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒంటరిగా బయటకు రావద్దని, పశువులను అడవుల్లోకి తోలుకెళ్లవద్దని హెచ్చరించారు. పులికి ఎలాంటి హాని కలిగించవద్దని, పులి వలన ఎవరికీ ఎలాంటి నష్టం జరిగినా అటవీ శాఖ నుంచి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.